తెలంగాణ భారతీయ జనతా పార్టీ.. పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనే భారాసను ఓడించేసి, తాము కాషాయజెండా రెపరెపలాడిస్తామని చాలా ఆర్భాటంగా కొంతకాలంగా ప్రకటిస్తూ వస్తున్నారు గానీ.. ప్రస్తుతానికి ఆ ప్రగల్భాల జోరు తగ్గింది. గెలుస్తున్నాం అనే మాటల ఒరవడి తగ్గింది. ఒకవైపు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే తెలంగాణ బిజెపి మాత్రం.. ఇంకా తగినంతగా సిద్ధం అవుతున్నట్టు లేదు. పైగా తెలంగాణలో బిజెపి వీక్ గా ఉందనే సంగతి వారంతట వారే బయటపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతుండగా.. రెండు రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థుల తొలిజాబితాలను ప్రకటించడం ద్వారా.. బిజెపి తెలంగాణలో తామింకా ఆ దశకు చేరుకోలేదని సంకేతాలిస్తోంది.
తెలంగాణ బిజెపి- ఒక రకంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత స్తబ్ధంగా మారిపోయింది. అసలే కిషన్ రెడ్డి అంటేనే.. కేసీఆర్ అనుకూల కమల నాయకుడనే పుకార్లు ప్రబలంగా ఉన్న నేపథ్యంలో.. కీలక ఎన్నికల సమయానికి తనకు సారథ్యం అప్పగించినందుకు .. ఆ పుకార్లు నిజం కాదని చాటిచెప్పేలా.. కిషన్ రెడ్డి మరింత దూకుడుగా ప్రవర్తించి ఉండాలి. కానీ.. ఆయన చాలా నీరసంగా పార్టీని నడిపిస్తున్నారనే అపప్రధను మూటగట్టుకున్నారు.
బండి సంజయ్ రాష్ట్రఅ ధ్యక్షుడిగా ఉన్నంత వరకు.. మహా జోరుగా పార్టీ వ్యవహారాలు సాగాయి. కేసీఆర్ అండ్ కో కు ఊపిరి సలపనివ్వనంతగా బండి సంజయ్ తానొక్కడే పదిమంది నాయకుల పెట్టు అన్నట్టుగా నిత్యం విరుచుకుపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ జోరు లేదు. రెండు రాష్ట్రాల్లో తొలి జాబితాలు వచ్చాయంటే, తెలంగాణలో జాబితా తయారుచేసే స్థితిలో వారు లేరని అర్థమైపోతోంది. అసలు.. ఆ పార్టీకి రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే సత్తా కూడా లేదని పలువురు అంచనా వేస్తున్నారు. రెండు రాష్ట్రాల లిస్టులు బయటపెట్టడం ద్వారా.. బిజెపి కేంద్ర నాయకత్వం వ్యూహం బెడిసి కొట్టింది. మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై చులకన అభిప్రాయం ఏర్పడుతుంది. టిబిజెపి దుస్థితి అదే. పార్టీ నాయకులంతా కూడా నీరసంగా వ్యవహరిస్తున్నారు. మరి కిషన్ రెడ్డి వారిలో జోష్ నింపి.. ఎన్నికలకు ఎలా సిద్ధం చేస్తారో వేచిచూడాలి.
తె-బీజేపీ వీక్ నెస్ బయటపడుతోందిలా..?
Wednesday, January 22, 2025