తె-బిజెపి  బలం పాలపొంగులా చల్లారనుందా?

Wednesday, January 22, 2025

తెలంగాణ బిజెపి రాబోయే ఎన్నికల్లో అధికారపీఠం అధిరోహించేది తామే.. అని చాలా గట్టిగా చెప్పుకుంటూ వస్తోంది. నిజానికి దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి అంతో ఇంతో ప్రజాదరణ మిగిలిఉన్నదని చాటుకోవాలంటే.. వారికి గల ఏకైక ఆశాకిరణం తెలంగాణ మాత్రమే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో  భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. తమిళనాడు, కేరళల్లో ఎటూ ఠికానా లేదు. కర్ణాటకలో తాజాగా తలబొప్పి కట్టి ఉంది. దేశాన్ని ఏలుతున్న పార్టీ.. దక్షిణ భారతదేశంలో అస్సలు సోదిలో లేని పార్టీ అంటే చాలా అవమానం అనే ఉద్దేశంతో.. తెలంగాణలో అస్తిత్వ నిరూపణకు ఆ పార్టీ చాలా తపన పడుతోంది. ఆ క్రమంలో భాగంగానే అగ్రనాయకుల బహిరంగ సభలు వరుసగా నిర్వహించే ప్రయత్నంలో కూడా ఉంది. గుజరాత్ కల్లోలం నేపథ్యంలో అమిత్ షా సభ మిస్సయింది గానీ.. త్వరలోనే మోడీ సభ కూడా జరగనుంది.

ఇన్నింటి నేపథ్యంలో.. బిజెపి ముందుకు సాగుతుండగా.. ఆ పార్టీ ఆశలపై నీళ్లు చిలకరించేలా పార్టీనుంచి చాలా మంది నాయకులు కాంగ్రెస్ లోకి ఫిరాయించడానికి దారులు వెతుక్కుంటున్నారనే గుసగుసలు సర్వత్రా వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గనుక, ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలం తక్కువ.  వారు పైకి ఎంత బుకాయించినప్పటికీ.. పార్టీలో ఉన్న వారికి ఆ సంగతి తెలుసు. పైగా కర్ణాటక విజయం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా కొత్త జవసత్వాలు పుంజుకుంటున్నది. ఇతర పార్టీలనుంచి కీలక నాయకులను తమలో చేర్చుకోవడానికి  ప్రయత్నిస్తున్నది.

బిజెపి నేతలు కూడా పలువురు.. టికెట్ గ్యారంటీ లభిస్తే, కాంగ్రెస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు ఆ మేరకు కాంగ్రెస్ వారితో మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను తమ పార్టీలోకి చేరేలా ఒప్పించలేకపోవడంలోనే బిజెపి డొల్లతనం బయటపడింది. ఇది పార్టీలో ఉన్న అనేకమంది ఇతర నాయకుల ఆలోచన సరళిని కూడా ప్రభావితం చేసినట్లుగా సమాచారం. కాంగ్రెస్ పరిస్థితి చూస్తే.. పట్నం మహేందర్ రెడ్డి వంటి సీనియర్ భారాస నాయకులు కూడా కోరినట్టుగా టికెట్ గ్యారంటీ ఉంటే కాంగ్రెసులోకి రావడానికి సిద్ధమని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది బిజెపి నేతలు కాంగ్రెస్ చూపు చూస్తున్నారు.

అన్నింటికంటె పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ తన పదవికి రాజీనామా చేసి బిజెపి కండువా కప్పుకుని ఉపఎన్నికలో పోటీచేసి భారాస చేతిలో దారుణంగా ఓడిపోయిన మునుగోడు నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెసు లోకే వస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. అదికూడా పూర్తయిందంటే.. తెలంగాణ బిజెపి మీద పాతతరం నాయకులకు తప్ప.. కొత్తతరంలో ఆ పార్టీలోకి వచ్చిన వారందరికీ నమ్మకం సడలిపోతున్నదని అనుకోవాల్సి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles