నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తెలుగు ప్రజలను దారుణంగా వంచించింది. కేంద్రం నుంచి రాష్ట్రాలు ఏం కోరుకుంటాయో.. వాటి ప్రస్తావన కూడా లేకుండా చేసింది. అత్యంత దారుణంగా ఇతర రాష్ట్రాలకు అనుచితమైన కేటాయింపులు చేస్తూనే.. తెలుగు రాష్ట్రాలు ఎంతో కాలంగా అంగలారుస్తున్న ప్రాజెక్టులకు పైసా కూడా విదిలించకుండా కేంద్ర బడ్జెట్ తమ వంచనాశిల్పాన్ని మరోసారి ప్రదర్శించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ఏపీకి జరిగిన వంచన మరింత ఘోరమైనది.
పోలవరం ప్రాజెక్టును నూరుశాతం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే హామీతోనే రాష్ట్రాన్ని కేంద్రం రెండు ముక్కలు చేసింది. పోలవరం నిర్మాణం జరుగుతుండగా.. వారు ఆ మద్దతును ఎన్నడూ స్పష్టంగా చూపించింది లేదు. మోడీసర్కారు గద్దె ఎక్కిన నాటినుంచి ఏపీ పట్ల ఎంతటి వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదో అందరికీ కనిపిస్తూనే ఉంది. చివరికి ఈ బడ్జెట్ లో కూడా అదే ధోరణి చూపించారు.
పూర్తిస్థాయి జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి పైసా ప్రకటించలేదు. అదే సమయంలో సరైన నీటిలభ్యత కూడా లేని కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంతో పాటు దాని నిర్మాణానికి ఏకంగా 5300 కోట్లు కేటాయించారు. అలాగే యూపీ-ఎంపీ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కెన్‌బెత్వాకు 3500 కోట్లు కేటాయించారు. ఏపీలోని పోలవరం ఏం పాపం చేసింది? ఎందుకు కేంద్రం నిధులు కేటాయించడంలో ఇంత దారుణంగా మోసంచేస్తోంది అనేది ఎవ్వరికీ అర్థం కాని సంగతి. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో ఏడాది పొడవునా కేంద్రం పోలవరానికి ఇచ్చింది కేవంల 478 కోట్లు మాత్రమే. పునరావాసం సహా సమస్త ఖర్చులను కేంద్రం చెల్లించాల్సి ఉండగా.. రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా, బడ్జెట్ లో అసలు ప్రస్తావనే లేకుండా తెలుగు ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది.
కేవలం ఏపీ మాత్రమే కాదు.. తెలంగాణ విషయంలో కూడా కేంద్ర బడ్జెట్ ఒరగబెట్టిందేమీ లేదు. కేంద్ర బడ్జెట్ నుంచి కేటాయింపులకోసం .. తెలంగాణ రాష్ట్రం చాలా చాలా విన్నపాలు చేసింది. అయితే ఏ ఒక్కదానికి కూడా వారినుంచి మన్నన దక్కలేదు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని కలగంటున్న తెలంగాణలో కూడా అటు సింగరేణికి గానీ, మిషన్ భగీరథ, మెట్రో పొడిగింపు లాంటి ప్రభుత్వ ప్రతిపాదనలకు గానీ ఏమీ విదిల్చకుండా కేంద్రం ద్రోహం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో తమ పార్టీ ఇప్పట్లో ప్రజల మద్దతు చూరగొనడం బిజెపికి అసాధ్యం. వారు కొట్టిన దెబ్బలు చేసిన వంచనను తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు. రాజకీయ పార్టీలు ఏ లక్ష్యాలతో వారికి ఊడిగం చేస్తున్నప్పటికీ.. ప్రజలు మాత్రం క్షమించరు. ఈ బడ్జెట్ ద్వారా.. ప్రజల్లో మరింత వ్యతిరేకతను కేంద్రం మూటగట్టుకుంది. పరిస్థితులు ఇలా ఉండగా.. ఇది మహా గొప్ప బడ్జెట్ అని.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ప్రకటించడం కొసమెరుపు.
తెలుగు ప్రజలను దారుణంగా వంచించిన బడ్జెట్!
Saturday, November 23, 2024