తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. తెలుగుదేశం పాలన కాలంలో జరిగిన అభివృద్ధిలో కూడా ఆయన ముద్ర తప్పకుండా ఉంటుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాతి పరిణామాలలో.. కేసీఆర్ తో ఉన్న పాత పరిచయం దృష్ట్యా ఆయన తెరాసలో చేరిపోయారు. కానీ పార్టీలో ఇమడలేని వాతావరణం ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సైతం వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశాన్ని ప్రధానంగా బరిలో ఉండే పార్టీల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. సీనియర్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ తెలుగుదేశం పార్టీలోచేరబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అయితే.. కేసీఆర్ హవా బాగానే పనిచేసిన ఆ ఎన్నికల్లో తెరాస శ్రేణులే ద్రోహం చేయడం వల్ల ఓడిపోయినట్టుగా ఒక ప్రచారం జరిగింది. అప్పటినుంచి తుమ్మల నాగేశ్వరరావు కొంతకాలం స్తబ్దంగా ఉండిపోయారు. మళ్లీ ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజల ముందుకు వస్తానని అంటున్నారు. తెరాసలో ఒకవైపు ఆయన పరిస్థితి ఏమంత బాలేదనే వార్తలు వస్తున్నాయి. స్థానిక తెరాస శ్రేణులతో తేడాలున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా, పాలేరు నియోజకవర్గంలోనే తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమాలకు తుమ్మల హాజరయ్యారు. ఎన్టీఆర్ సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ వంటి ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేయడం అదృష్టం అని తుమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలంతా కలిసి, వచ్చే ఎన్నికల్లో తుమ్మల ఏ పార్టీ తరఫున పోటీచేసినా గెలిపిస్తాం అని చెప్పడం విశేషం.
ఈ మాటలు నిజమే కావొచ్చు గానీ.. వీటిని చూసుకుని గులాబీ శ్రేణులు తమకు మరో ఎమ్మెల్యే సీటు దక్కుతుందని మురిసిపోతే కుదరదు. ఎందుకంటే.. తుమ్మల నాగేశ్వరరావే గులాబీ పార్టీని వీడి, తిరిగి మాతృసంస్థ తెలుగుదేశంలోకి వచ్చే అవకాశమే ఎక్కువ.
కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ పార్టీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. పార్టీని ఒకింత యాక్టివ్ గా నడుపుతున్నారు. ఖమ్మంలో డిసెంబరులో భారీ బహిరంగసభను కూడా ఏర్పాటుచేశారు. ఈ నేపథ్యంలో ఆ సభ జరిగే నాటికి తుమ్మల తిరిగి తెలుగుదేశంలో చేరడం గురించి నిర్ణయానికి వస్తారని, వచ్చే ఎన్నికల్లో పార్టీకి కొత్త ఊపు తెస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి.
తెలుగుదేశం గూటికి చేరనున్న సీనియర్ మాజీ మంత్రి!
Friday, December 27, 2024