సినిమాలలో చాలా సర్వసాధారణమైన ఒక సిద్ధాంతం ఉంటుంది. హీరోయిజం ఎంతగా ఎలివేట్ కావాలనుకుంటే.. విలన్ ని అంత బలమైన వాడిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. విలన్ ఎంతో బలవంతుడని ముందుగా ప్రేక్షకుల్ని నమ్మిస్తేనే.. ఆ విలన్ని దెబ్బకొట్టిన తర్వాత.. హీరో అదే ప్రేక్షకులకు ఆరాధ్యుడు అవుతాడు. ఈ సినిమా మేకింగ్ సిద్ధాంతం చెప్పే నీతి ఏంటంటే.. ప్రత్యర్థి ఉండాలి. ప్రత్యర్థి కూడా బలంగా ఉన్నప్పుడే మనం కష్టపడి మన నైపుణ్యాలను మెరుగుపరచుకుంటాం..మరింత బలంగా తయారవుతాం.. అని!
కానీ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఒక సరికొత్త డిమాండ్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ఆయన డిమాండ్ ను వింటే ఎవ్వరికైనా నవ్వు వస్తుంది. తెలుగుదేశాన్ని చూసి.. విజయసాయిరెడ్డి మరీ అంతగా భయపడిపోతున్నారా అని కూడా అనిపిస్తుంది. ఇంతకూ విజయసాయి డిమాండ్ ఏమిటో తెలుసా?
తెలుగుదేశం పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయాల. తెలుగుదేశం సైకిలు గుర్తును కూడా రద్దుచేయాలట! 2024 ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ కోడై కూస్తున్నాయట. ఆ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంతర్ధానం అయిపోతుందిట.
విజయసాయి మాటల్లో అపరిమితమైన భయం, కాంట్రడిక్షన్ కనిపిస్తున్నాయి. ఆయన చెబుతున్న జోస్యం నిజమై.. 2024 ఎన్నికల తర్వాత.. వైసీపీ సంపూర్ణమైన మెజారిటీని సాధించడం, తెలుగుదేశం అంతర్ధానం అయిపోవడం జరిగితే గనుక.. వారికే మంచిది కద. మరి ఇప్పటినుంచి ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని దేబిరించడం ఎందుకు? ఆ పార్టీ పోటీలో ఉంటే తమ పప్పులు ఉడకవని, తమకు ఓటమి తప్పదని భయపడడానికి ఇది సంకేతం అనిపించుకోదా? అనేది ప్రజలకు ఎదురవుతున్న సందేహం.
రాజకీయాల్లో ప్రత్యర్థి ఉండాలి.. మనం గెలవాలి.. అని పార్టీలు కోరుకోవాలి. అంతే తప్ప.. అసలు ప్రత్యర్థి లేకుండాపోతే.. మనం ఏకపక్షంగా అధికారం చెలాయిద్దం అని భావిస్తే గనుక.. అలాంటి అత్యాశలకు ఎదురుదెబ్బలు తప్పవు.
తెదేపా అంటే అంత భయమా, విజయసాయీ!
Sunday, December 22, 2024