తుమ్మల రాక : పొంగులేటి, షర్మిల పరిస్థితులేంటి?

Tuesday, November 19, 2024

సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు తన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం విషయంలో స్పష్టత ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి తనకు పాలేరు టికెట్ నిరాకరించిన తర్వాత.. తుమ్మల నాగేశ్వరరావు అలకపూని ఉన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎన్నికలలో పోటీచేయడం మాత్రం గ్యారంటీ అని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. రాజీనామా లాంఛనం జరగలేదు గానీ.. భారాసకు దూరం అయ్యారు. తాజాగా పీసీసీ చీఫ్ తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో సానుకూలంగా తుమ్మల స్పందించారు. ఆయనకు పాలేరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అనుకూలంగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచేపోటీచేయాలని తుమ్మల నాగేశ్వరరావు చాలాకాలంగా కోరుకుంటూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడినుంచే ఆయన భారాస తరఫున ఓడిపోయారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెసు తరఫున గెలిచారు. తర్వాతి పరిణామాల్లో కందాల భారాస తీర్థం పుచ్చుకున్నారు. అయినా సరే.. ఈ ఏడాది ఎన్నికల్లో పార్టీ తనకే టికెట్ ఇస్తుందని తుమ్మల నమ్ముతూ వచ్చారు. గత నాలుగేళ్లలో తుమ్మలకు ఒకసారైనా అపాయింట్మెంట్ కూడా ఇవ్వని కేసీఆర్, చివరకు ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో తుమ్మల అలక వహించి.. బయటకు వచ్చారు. ఎట్టకేలకు పాలేరు టికెట్ హామీతో కాంగ్రెసులో చేరబోతున్నారు.

అయితే ఖమ్మంలో పాలేరు టికెట్ కాంగ్రెస్ కు హాట్ కేక్ లాంటిది. భార బలగం, అనుచరగణంతో కాంగ్రెసులో  చేరిన మరో భారాస నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెటును కోరుకుంటున్నారు. ఆయన ఖమ్మం మరియు పాలేరు రెండు స్థానాలకు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో తన అనుచరులకు కూడా కొన్ని టికెట్లు అడుగుతున్న పొంగులేటి.. ఈ రెండింటిలో ఏదైనా ఓకే అని చెప్పారని, అయితే ఆయన తొలిప్రాధాన్యం పాలేరు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పాలేరు సీటును తుమ్మలకు ఖరారు చేయడం వలన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంతోనే సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైఎస్సార్ తెలంగాణ పార్టీని నడిపిన వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచి ఈ ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టు.. తాను పార్టీ పెట్టిన నాటినుంచి పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. సరిగ్గా ఇవాళే ఆమె కూడా ఢిల్లీలో సోనియా, రాహుల్ లతో సమావేశమయ్యారు గానీ.. చేరిక సంగతి ధ్రువీకరించలేదు. పాలేరు సీటు తుమ్మలకు ఖరారైన తర్వాత.. షర్మిల తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినా సరే.. ఆ సీటు ఆమెకు దక్కడం అసాధ్యం అని తెలుస్తోంది. మరి ఆమెకు పార్టీ ఏం ప్రత్యామ్నాయం చూపిస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles