ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడు, ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీల గెలుపోటములను నిర్దేశించగల స్థాయి బలం ఉన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెసు పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6వ తేదీన ఆయన కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నారు. తాను చిరకాలంగా కోరుకున్న పాలేరు అసెంబ్లీ సీటును ఇవ్వడానికి భారాస నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ.. ఖమ్మం జిల్లాలో తుమ్మల భారీ ఎత్తున బలప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఏదైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో పోటీచేసేది నిజం.. అని ఆయన తేల్చిచెప్పిన తర్వాత.. ఆయనను తమ జట్టులో కలుపుకోవడానికి కాంగ్రెసు ఆశ్రయించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు వెళ్లి తుమ్మలను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన వారి ముందు పలు డిమాండ్లు పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ కాంగ్రెసు పార్టీ గెలిచినట్లయితే.. తనకు కేబినెట్లో మంత్రి పదవి కావాలని కూడా ఆయన వారి ముందు డిమాండ్ పెట్టారు. అలాగే.. తనకు ఇరిగేషన్ శాఖ కావాలని కూడా ఆయన తన కోరికను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు గానీ.. ఈ దశలోనే శాఖను కూడా నిర్ణయించి చెప్పడం అనేది కష్టమేమోనని పార్టీ వర్గాలు చెప్పినట్టుగా సమాచారం. అయితే వీలైనంత వరకు తనకు ఇరిగేషన్ శాఖే కావాలని.. పార్టీ ప్రతిష్ఠ పెంచేలా తాను ఆ శాఖను నిర్వర్తించగలనని తుమ్మల వారికి చెప్పినట్టుగా తెలుస్తోంది.
తుమ్మల గతంలో రెండుసార్లు ఇరిగేషన్ శాఖను నిర్వహించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో మైనర్ ఇరిగేషన్ శాఖను చూసిన తుమ్మల, చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మేజర్ ఇరిగేషన్ శాఖ ను నిర్వర్తించారు. ఇప్పుడు భారాస మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన తర్వాత.. తన జిల్లాలోని అనుచరులు, కార్యకర్తలతో ఆయన ఒక మాట చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం ఒక్కటే తన జీవితలక్ష్యమని అంటున్నారు. అదే సమయంలో.. సీతారామ ప్రాజెక్టు పూర్తిచేసిన తరువాత.. తాను రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటానని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నరు. ఆయన గత అనుభవాన్ని, ఈ మాటలను కూడా పోల్చి చూసుకుంటే.. కాంగ్రెసు పార్టీ గెలిచే పక్షంలో అందులో ఇరిగేషన్ మంత్ిర పోస్టునే తుమ్మల అడుగుతున్నట్టు తెలుస్తోంది.
తుమ్మల బేరం: ఇరిగేషన్ మంత్రి పదవి!
Sunday, January 19, 2025