తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు వేగంగా చోటుచేసుకోబోతున్నాయి. కొన్ని రోజుల కిందట చంద్రబాబునాయుడు భారీ బహిరంగ సభ నిర్వహించిన ఖమ్మంలో.. కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేవనుంది. భారాసలో ఉన్న కీలక, సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరూ పార్టీ మారబోతున్నారు. పొంగులేటి బిజెపి నాయకులతో చాలా రోజులుగా టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. అయితే పొంగులేటిని తన పార్టీలో చేర్చుకోవడానికి తమ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రయోగించాలని షర్మిల కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు మళ్లీ తెలుగుదేశంలో చేరడం ఖరారు అయినట్టే.
ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి కీలక నాయకుడు తిరిగి తెలుగుదేశం లోకి రావడం అంటూ జరిగితే, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ పార్టీకి కొత్త ఊపు వస్తుందనే అంచనాలు పార్టీలో సాగుతున్నాయి. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ కొత్త సారధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీ విస్తరణకు చేసిన తొలి ప్రయత్నానికి ఖమ్మం జిల్లానే ఎంచుకున్నారు. సాధారణంగా ఆ జిల్లాలో పార్టీకి బలం ఎక్కువ. దానికి తగినట్టే చంద్రబాబు నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు పెద్దసంఖ్యలోనే హాజరయ్యారు. అలా విజయవంతం కావడానికి తుమ్మల వర్గం నాయకులు కూడా సహకరించినట్టుగా గుసగుసలు ఉన్నాయి. అదే ఖమ్మం సభ వేదిక మీదనుంచి పార్టీనుంచి వెళ్లిపోయిన నాయకులంతా తిరిగి వస్తే.. పార్టీ తొందరగా పూర్వవైభవం సంతరించుకుంటుందని చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు కూడా.
తుమ్మల నాగేశ్వరరావు న్యూ ఇయర్ డే నాడు.. తన అభిమానులకు చాలా పెద్ద విందు ఇచ్చారు. ఈ విందు మొత్తం ఆయన పార్టీ మారే సంకేతాలనే ప్రజల్లోకి పంపింది. పైకి ఎవ్వరూ ఏమీ ప్రకటించకపోయినా.. కార్యకర్తలంతా.. ఆయనను తిరిగి పాలేరునుంచి మాత్రమే పోటీచేయాలని కోరడం, పాలేరులో ప్రస్తుతం గులాబీ ఎమ్మెల్యే ఉండడం.. ఇలాంటివన్నీ సంకేతాలు. తుమ్మల చేరిక.. ఖమ్మం జిల్లాకు సంబంధించినంతవరకు అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తుందని, తెలుగుదేశం బలోపేతం అవుతుందని అంచనాలు ఉన్నాయి.
అయితే తుమ్మల కోసం బిజెపి కూడా ప్రయత్నిస్తున్నది. తెలుగుదేశంలోకి వెళితే.. అగమ్యగోచరంగా ఉంటుందని.. బిజెపిలోకి వస్తే.. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని వాళ్లు ఎరవేస్తున్నారు. తుమ్మల ఎటు నిర్ణయించుకుంటారో.. తన మాతృపార్టీలోకే వస్తారో.. అవకాశం ఉన్నది గనుక.. కమలదళంలో చేరుతారో వేచిచూడాలి.
తుమ్మల చేరిక తెదేపాకు ఉత్సాహాన్నిస్తుందా?
Saturday, November 23, 2024