గన్నవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం బయటపడింది. నిజానికి ఇది ఎన్నాళ్లనుంచో ఉన్న ముసలమే. ఎన్నికలకు వచ్చే నాటికి ఈ ముసలం ఎలాంటి రూపం సంతరించుకుంటుంది.. అనే విషయంలో మాత్రమే ఇన్నాళ్లూ సస్నెన్స్ ఉంది. ఇప్పుడు అది కూడా తొలగిపోయింది. గన్నవరం అభ్యర్థిలో వైఎస్సార్ కాంగ్రెస్ కు తిరుగుబాటు అభ్యర్థితో తలపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ తిరుగుబాటు అభ్యర్థి కేవలం ఇండిపెండెంటుగా ఉండి తమ విజయావకాశాలకు దెబ్బకొడతారా? లేదా, ప్రత్యర్థి పార్టీ టికెట్ మీద బరిలోకి దిగి ఓడించగలరా? అనేది ఒక్కటే తేలాలి! బంతి ప్రస్తుతానికి జగన్ కోర్టుకు చేరింది.
గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున గెలిచి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వడం అనేది కేవలం లాంఛనమే. టికెట్ గ్యారంటీ తీసుకున్న తర్వాతనే ఆయన వైసీపీలోకి వచ్చి.. జగన్ కళ్లలో ఆనందం చూడడం కోసం చంద్రబాబు కుటుంబం మీద, తెలుగుదేశం మీద అత్యంత అనుచితమైన లేకి వ్యాఖ్యలు చేస్తూ చర్చల్లోకి వచ్చారు. అలాంటి వంశీతో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తలపడి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు ప్రస్తుతం తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
తాను వైసీపీ తరఫున పోటీచేయడం వలన ఏర్పడిన రాజకీయ వైరం తప్ప.. వంశీతో తనకు ఎలాంటి గట్టు తగాదాలు లేవని.. అలాంటిది ఆయనను పార్టీలోకి తీసుకోవడం వల్ల కార్యకర్తలకు నష్టం జరిగిందని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుంచి జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నస్తోంటే తనకు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యార్లగడ్డ వెంకటరావు తన అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత.. ఇప్పటిదాకా కార్యకర్తల సమావేశమే జరగలేదని, అందుకోసమే ఇప్పుడు ఈ సమావేశం పెట్టానని అంటున్నారు. తనకు ఇన్నాళ్లు అండగా నిలిచిన కార్యకర్తలను కాపాడుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా పోటీచేస్తానని యార్లగడ్డ తేల్చిచెప్పారు. అయితే ఆయన ఇండిపెండెంటుగా బరిలో ఉంటారా.. లేదా, ఎన్నికల్లోగా తెలుగుదేశంలో చేరి వారి తరఫున పోటీచేస్తారా? అనే సంగతి క్లారిటీ ఇవ్వలేదు. అయితే యార్లగడ్డ సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం కూడా రాజకీయవర్గాల్లో నడుస్తోంది. అయితే బంతి ఇప్పటికీ జగన్ కోర్టులో ఉన్నదని.. యార్లగడ్డను బుజ్జగించి పార్టీకి నష్టం లేకుండా చూసుకుంటారా? లేదా, తిరుగుబాటు ప్రకటించారు గనక.. ఆయనను పార్టీకి దూరం పెడతారా? అనేది వేచిచూడాలి.