ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకులలో నాగం జనార్ధన రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఆయన ప్రాభవం గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముమ్మరంగా ఉద్యమం జరుగుతున్న రోజుల్లో, తెదేపా నుంచి బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి కొన్నాళ్లపాటు సొంత పార్టీ ప్రయోగం నడిపించారు. ఆ తరువాత కమలదళంలో చేరారు. ఎన్నికలను కూడా ఎదుర్కొని భంగపడ్డారు. భారతీయ జనతా పార్టీలో- బయటి నుంచి వచ్చిన నాయకులను పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలో నాగం చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చాలాకాలంగా లోప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారని సంగతిని ఆయన చెబితే తప్ప గుర్తుంచుకోవడం కష్టం. అలాంటి నాగం జనార్దన్ రెడ్డి ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేయాలా అక్కర్లేదా అనే సంగతి తన అభిమానులు పార్టీ శ్రేణులతో చర్చించి డిసైడ్ చేస్తానని ఆయన అంటున్నారు. ‘పార్టీ శ్రేణులతో అభిప్రాయ సేకరణకు సమావేశం’ అనగానే అది ‘తిరుగుబాటు’ అనే సంగతి మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. కానీ.. అన్ని పార్టీలూ తిరిగేసిన నాగం జనార్దన్ రెడ్డి- ఇప్పుడు కాంగ్రెస్ మీద తిరగబడితే ప్రత్యామ్నాయం చూసుకోవడానికి వేరే దారి ఉన్నదా లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది.
పూర్వ మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నాగం జనార్దన్ రెడ్డి అనేక కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఆయనను పట్టించుకుంటున్న వారు లేరు. ప్రాభవం మొత్తం మసకబారిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు భారాస నుంచి బహిష్కృతుడైన తర్వాత కాంగ్రెసులో చేరారు. ఆయన నాగం నియోజకవర్గానికి కూడా చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ‘జూపల్లి కృష్ణారావు పార్టీలోకి రాగానే కొల్లాపూర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, తదితర ఐదు నియోజకవర్గాల టికెట్లు అడుగుతున్నారట’ అంటూ నాగం జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అవినీతిపై తేల్చుకోవడం గురించి కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోవడంలేదని నాగం పరోక్ష విమర్శలు చేస్తున్నారు. ఈ సంకేతాలన్నీ ఆయన పార్టీపై తిరుగుబాటు ధోరణికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి గాని.. వేరే ప్రత్యామ్నాయం ఏమున్నది అనేది అర్థం కావడం లేదు. తిరిగి భాజపాలోనికి వెళ్లేంత సీన్ ఉన్నదా? కెసిఆర్ ఆయనను దగ్గరకు రానిస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.