సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రజాక్షేత్రంలో ప్రజలను నమ్మించి ఓట్లు కొల్లగొట్టగలిగేంతటి నాయకుడు తనను తాను నిరూపించుకోలేకపోయారు గానీ.. ఆయనకు మేధావి నాయకుడిగా, రాజకీయాల్లో సంస్కరణలు కోరుకుంటున్న వ్యక్తిగా ఒక వర్గం ప్రజల్లో గుర్తింపు ఉంది. ఆయన మాటకు విలువ ఉంది. చిత్తశుద్ధి మీద కూడా పలువురికి విశ్వాసం ఉంది. అయితే విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో ఆయన చేసిన ఒక తమాషా ప్రతిపాదన మాత్రం తలాతోకాలేనిదని ప్రజలు అనుకుంటున్నారు. ఏదో మాటల్లో చెప్పుకోడానికి చాలా అందంగా కనిపిస్తుంది గానీ.. ఆచరణలో ఏమాత్రం సాధ్యమయ్యేది కాదని పలువురు అంటున్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటీకరణ విషయంలో కేంద్రం రెండురోజుల వ్యవధిలోనే ఎన్ని రకాల డ్రామాలు ప్లే చేసినదో అందరికీ తెలుసు. ప్రెవేటీకరణ లేదని చెప్పేసి, ఆ వెంటనే మరురోజున.. ప్రెవేటీకరణ ఆలోచన ఉపసంహరించుకోలేదని అన్నారు. సో, ప్రెవేటీకరణ యథాతథంగా కేంద్రం సంకల్పించినట్టుగా జరుగుతుందని తేలిపోయింది. ఈ ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పుడు విశాఖ ఇంకాస్త గట్టిగా నినదిస్తోంది. శనివారం నాడు విశాఖలో పాదయాత్ర కూడా గట్టిగానే జరిగింది. గతంలో విశాఖనుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినప్పటికీ.. ఆ నియోజకవవర్గం మీద బాగానే ఫోకస్ పెడుతున్న మాజీ జెడీ లక్ష్మీనారాయణ కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. నిజానికి ఒక ప్రెవేటు కంపెని తరఫున బిడ్ కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా.. విశాఖ ఉక్కు ప్రెవేటు పరం కాకుండా ఉండాలంటే.. ప్రజలు స్పందించడం ఒక్కటే మార్గమని ఐడియా చెప్పారు.
ఆ ప్రకారం.. తెలుగు ఆత్మగౌరవానికి సంబంధించిన విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి 8.5 కోట్ల మంది తెలుగు ప్రజలు నెలకు ఒక వంద రూపాయల వంతున, నాలుగు నెలల పాటు విరాళంగా ఇవ్వాలట. దీని వల్ల నెలకు 850 కోట్లు జమ అవుతాయి. నాలుగునెలల్లో విశాఖఉక్కును నిలబెట్టేయవచ్చునట.
కాగితం మీద రాస్తే ఈ ఐడియా బాగానే ఉంటుంది. కానీ ఆచరణలో తలాతోకా ఉన్నదేనా అనేది పలువురి సందేహం. కేసీఆర్ ఏదో తన భారాస ఏపీలో అడుగుపెట్టడానికి ఒక మార్గంగా వాడుకోవడం కోసం.. విశాఖ ఉక్కు బిడ్ లో పాల్గొంటామని అన్నారు. అంతమాత్రాన తెలంగాణలో ఉన్న తెలుగువారు ఏ ఒక్కరైనా సరే.. ఈ పరిశ్రమకోసం 400 రూపాయలు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు. ఇదొక అసాధ్యమైన సంగతి.
అయినా ఒక సమూహంలో వందమంది ఉంటే.. అందరినుంచి ఒక పనికోసం సమానంగా నిధులు రాబట్టడం కష్టం. అలాంటిది.. ఎనిమిదిన్నర కోట్ల మంది ఒకే మాట మీద నెలకు వందరూపాయలు ఇవ్వడం అంటే సాధ్యమయ్యే పని కానే కాదు. మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను ప్రవచించే మాటలు ఆదర్శాలుగా గొప్పగా కనిపించవచ్చు గానీ.. వాటిని ఆచరణలోకి తేవడం అనేది చాలా పాక్షికంగా మాత్రమే కుదురుతుంది.
తలాతోకాలేని డీల్ చెప్పిన జేడీ లక్ష్మీ!
Sunday, January 19, 2025