తలతో చుట్టరికం.. తోక అంటే పగ!

Sunday, December 22, 2024

‘తల పగ.. తోక చుట్టరికం..’ అనేది సామెత. ఒక వర్గంలోని కీలకమైన వ్యక్తులతో వైరం కొనసాగిస్తూ.. కిందిస్థాయి వాళ్లతో స్నేహంగా ఉండేవాళ్ల గురించి ఈ సామెతతో పోలుస్తుంటారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి వైఖరి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. తలతో చాలా మెతక వైఖరితో చుట్టరికం మెయింటైన్ చేసే ఆయన, తోకతో పగను, వైరాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి విషయంలో ఆయన వ్యవహార సరళి విస్తుగొలుపుతోంది.

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులంటే చాలా ప్రేమ, భక్తి గౌరవాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కేంద్రంలోని అందరు బిజెపి నాయకులతో ఆయన సత్సంబంధాలు నెరపుతూ ఉంటారు. తరచూ వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తూ ఉంటారు. వారికి పూలబొకేలు, దేవుడి ప్రసాదాలు, శాలువాలూ అందజేసి సంతృప్తి పరుస్తూ ఉంటారు. అయితే అదే విజయసాయిరెడ్డి ఇప్పుడు.. రాష్ట్ర భారతీయ జనతాపార్టీకి సారథ్యం వహిస్తున్న చిన్నమ్మ మీద మాత్రం వెటకారపు నిప్పులు చెరగుతున్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి బిజెపి సారథి పురందేశ్వరి తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పులు తీసుకురాకుండా ఒక్క నెల కూడా గడవడం లేదని, రిజర్వు బ్యాంకు వద్ద ఆస్తులు సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టి రుణాలు చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐ పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులను మాత్రమే చెప్పారని, తాను అనధికారికంగా వారు చేసిన అప్పులను కూడా చెప్పానని పురందేశ్వరి వివరించారు.

అయితే చిన్నమ్మ తమ ప్రభుత్వ లోపాలను చెప్పడం విజయసాయిరెడ్డికి కంటగింపుగా మారినట్టుంది. అందుకే ఆయన ‘‘పార్లమెంటులో స్వయంగా ఆర్థికమంత్రే ప్రకటించినా పట్టించుకోకుండా.. ఏవో కాకిలెక్కలు చెబుతోంది చెల్లెమ్మ పురందేశ్వరి. నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదంటూ గాలి మాటలెందుకు? ఈ నాలుగేళ్లలో మీరు ఒక్కసారి రాష్ట్రానికి రాలేదన్నది వాస్తవం. బావ కళ్లలో ఆనందం కోసం కాదమ్మా.. ఉన్న పార్టీకోసం పనిచేయొచ్చుగా’’ అని విజయసాయి ట్వీట్ చేశారు.

అయితే ఇన్నాళ్లూ సోము వీర్రాజు ను దువ్వుతూ ఉండడం ద్వారా.. రాష్ట్ర బిజెపి నుంచి ప్రభుత్వం సీరియస్ విమర్శలు లేకుండా గడిపేస్తూ వచ్చిన వైసీపీ దళాలకు పురందేశ్వరి తీరు కంటగింపుగా ఉన్నట్టుంది. అందుకే ఆయన ఇలా విరుచుకుపడ్డారు. నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమైనా రాలేదని ఆమె అంటే.. వచ్చిందో లేదో జవాబు చెప్పకుండా మాట దాటేస్తూ.. ఇంకేదో రకంగా ఆమెను నిందించాలని చూస్తున్నారు. ‘బావకళ్లలో ఆనందం చూడడానికి’ అంటూ (నిజానికి మరిది) చంద్రబాబుకు అనుకూలంగా ఆమె మాట్లాడుతున్నారని నింద వేస్తున్నారు.

విజయసాయిరెడ్డి కంగారు, చిన్నమ్మ పట్ల స్పందిస్తున్న తీరు గమనిస్తోంటే.. పురందేశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలకు కొరుకుడు పడలేదని అర్థమవుతోంది. కేంద్ర నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే, ఆమె పట్ల వారు కక్షతో రగిలిపోతున్నట్టుగా అనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles