తమ ఫెయిల్యూర్స్‌పై బండి భలే మాయ చేస్తున్నారే!

Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే ఎన్నికల్లోనే అధికార పీఠం మీదికి వచ్చేసి చరిత్ర సృష్టిస్తామని అంటున్న భారతీయ జనతా పార్టీ.. తదనుగుణంగా పార్టీని బలోపేతం చేసుకునే దిశగా విఫలం అవుతోంది. పార్టీ విస్తరణకు వారు చేస్తున్న ప్రయత్నలు బెడిసికొడుతున్నాయి. ఫెయిల్యూర్స్ పలకరిస్తున్నాయి. కేవలం బిజెపి ఫెయిల్యూర్ అవుతుండడం మాత్రమే కాదు.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఈ పోకడలు తమ పార్టీ పరువు మరింత తీస్తాయనే సంగతి కమలనాథులకు తెలుసు. అందుకే ముందుజాగ్రత్తగా తమ ఫెయిల్యూర్స్ ను ప్రజలు గుర్తించకుండా మాయ చేయడానికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటల గారడీ చేస్తున్నారు. మాయచేసి, అక్కడికేదో భారాస కుట్ర చేస్తున్నట్టుగా రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారు.

‘‘రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలను సర్ది, ఆ పార్టీని ఒక్క తాటిమీదకు తేవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారట. పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 18 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే, 12 మంది టీఆర్ఎస్ లోకి వచ్చేశారని, వచ్చే ఎన్నికల్లో కూడా అలాంటి రాజకీయమే చేయడానికి కాంగ్రెస్ వారు గెలిచినా పర్లేదు, మళ్లీ తన పార్టీలోనే చేరుతారనే ఉద్దేశంతో కేసీఆర్ వారి బలోపేతానికి సహకరిస్తున్నారట’’.. ఇంత డొంకతిరుగుడు వ్యూహాల గురించి వివరించగల వారు బహుశా బండి సంజయ్ తప్ప మరొకరు ఉండకపోవచ్చు. ఒకవైపు రాష్ట్రంలో సర్వేలన్నీ కూడా భాజపాకు అనుకూలంగా ఉన్నాయని గప్పాలు కొడుతూనే.. కాంగ్రెస్ ను గెలిపించి, ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడానికి భారాస వ్యూహరచన చేస్తున్నదని అనడం ఆయనకే చెల్లింది.

కొన్నాళ్లుగా బిజెపి తెలంగాణలో నానా యాగీ చేస్తుండగా.. కాంగ్రెసు పార్టీ ఒక్కసారిగా పుంజుకుని.. ప్రతిపక్షాల రేసులో ముందంజలోకి వెళ్లిపోవడాన్ని ఆయన జీర్ణించుకుంటున్నట్టుగా లేదు. ముఖ్యంగా పొంగులేటి, జూపల్లి లను తమ పార్టీలో చేర్చుకోవడానికి నానా కష్టాలు పడి మంతనాలు సాగిస్తే, తీరా వారు కాంగ్రెసులో చేరబోతుండడం బిజెపికి పెద్ద అవమానమే. ఈ అవమానం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన కేసీఆర్ కు కాంగ్రెస్ కు సంబంధాన్ని ముడిపెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ చేరికలకే బండి సంజయ్ ఇంతగా ఉక్రోషపడిపోయి ఇలాంటి వక్రవ్యాఖ్యానాలు చేస్తూ కూర్చుంటే.. రేపు పొద్దున బిజెపి నుంచి కూడా మరికొందరు నాయకులు కాంగ్రెసులోకి జంప్ చేస్తే అప్పుడు ఏం చెప్తారు? వారందరూ కూడా కేసీఆర్ కు అమ్ముడుపోయారని, ఆయన కుట్ర వ్యూహంలో భాగంగానే తొలుత తమ పార్టీలోకి వచ్చి, ఆతర్వాత ఇప్పుడు కాంగ్రెసులోకి వెళ్లారని ఇంకో డొంకతిరుగు విమర్శల రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారా? అనేది అర్థం కాని సంగతి. బండి సంజయ్ అవస్థ చూస్తోంటే తమ పార్టీ వైఫల్యాలను కప్పెట్టుకోవడానికి ఆయన మాటల మాయ చేస్తున్నట్టుగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles