తమ గొడవను తెలంగాణకు ముడిపెడతారేంటక్కా?

Wednesday, January 22, 2025

కవితకు బినామీగా ఈడీ పేర్కొంటున్న అరుణ్ పిళ్లైను అరెస్టు చేసిన తర్వాత.. ఆయనను వారం రోజుల కస్టడీలో ఉంచుకుని, అదే సమయంలో కల్వకుంట్ల కవితను విచారణకు ఈడీ ఆహ్వానించడం, రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. కల్వకుంట్ల కవితను ఈడీ 9వ తేదీ ఢిల్లీ రమ్మని పిలిచింది. పదోతేదీన నేను అదే ఢిల్లీలో ధర్నా చేయాల్సి ఉంది గనుక.. నాకు కుదరదు పొమ్మని ఆమె తెగేసి చెప్పారు. కావలిస్తే 11న రావడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె బినామీగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి ఆమెను విచారించాలనేది ఈడీ ప్లాన్ కాగా, దానిని ఎవాయిడ్ చేయడమే లక్ష్యంగా ఆమె గడువు కోరినట్లుగా కనిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈడీ తనకు సర్వ్ చేసిన నోటీసుల పట్ల కవిత స్పందిస్తున్న తీరు, చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ఇంకో ఎత్తు! తాను కేంద్రంపై పోరాడుతూనే ఉంటానని, తనకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణను, కేసీఆర్ ను లొంగదీసుకోలేరని కవిత అంటున్నారు. కవిత అనే రాజకీయ నాయకురాలు.. వ్యక్తిగతంగా ఒక అవినీతి నేరానికి పాల్పడిందనే ఆరోపణల మీద విచారణ సాగుతుండగా.. దానిని కవిత యావత్ తెలంగాణకు ముడిపెట్టడం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాని సంగతి.
కవిత నిజానికి ‘చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా’ వంటి పెద్దపెద్ద పదాలు వాడారు. చాలా సంతోషం. అలాంటప్పుడు ఆమె చట్టాన్ని గౌరవించి.. విచారణకు సహకరించాలి అంతే. 11న ఈడీ వద్దకు రావడానికి ఒప్పుకున్నారు. అయిపోయింది. విచారణలో ఆమె నిర్దోషిగా తేలితే.. మరింత సంతోషంగా బయటకు రావొచ్చు. ఆమె అభిమానులందరూ కూడా పండగ చేసుకోవచ్చు.
తన వ్యక్తిగత విషయాన్ని తెలంగాణకు ముడిపెట్టడం అనేది చాలా చీప్ ట్రిక్ గా పలువురు భావిస్తున్నారు. కవిత అవినీతి కేసులో అరెస్టు అయినంత మాత్రాన.. తెలంగాణ సమాజం మొత్తం అవినీతి పరులని, దొంగలని దాని అర్థం కాదు! ఆమె నిర్దోషిగా విచారణ అనంతరం బయటకు వచ్చినంత మాత్రాన.. తెలంగాణ సమాజానికి అది గర్వకారణమేమీ కాదు. అది ఆమె సొంత వ్యవహారం.
మరో రకంగా గమనించినప్పుడు.. ఇదే లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తరహాలోనే.. కవిత ప్రతిస్పందన కూడా హెచ్చు శృతిలో ధ్వనిస్తోంది. ఈ సంకేతాలు.. ఆమె అరెస్టు తథ్యమనే విధంగానే ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ఆమెను ఒకవేళ ఈడీ అరెస్టు చేస్తే గనుక.. యావత తెలంగాణ సమాజాన్ని జైల్లో పెట్టినట్టుగా ప్రకటించి ఉద్యమానికి పూనుకుంటారేమో మరి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles