వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనేది పూర్తిగా ఆస్తులకోసం జరిగిన హత్య అని, అందులో రాజకీయ కోణం ఎంతమాత్రమూ లేదని, తనను అనసవరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని, ఈ కుట్ర వెనుక చంద్రబాబునాయుడు స్కెచ్ ఉన్నదని, చంద్రబాబు నాయుడు, సునీత కలిసి సీబీఐను ఆడిస్తున్నారని.. ఇలా రకరకాలుగా వైఎస్ అవినాష్ రెడ్డి చాలా చాలా ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. నిందలు నేరుగా తన మీదకు వచ్చే వరకు సైలెంట్ గా ఉండి, ఇప్పుడు నోరు తెరిచి హత్యచేసింది ఫలానా వాళ్లే, చేయించింది ఫలానా వాళ్లే అని చెప్పినంత మాత్రాన ప్రజల దృష్టిలో ఆ నిందలకు క్రెడిబిలిటీ దక్కుతుందా లేదా అన్నది వేరే సంగతి. అయితే అవినాష్ రెడ్డి మాత్రం తన బాబాయి వివేకా హత్య అనేది పూర్తిగా ఆస్తికోసం జరిగిన హత్య , కూతురు అల్లుడు తెరవెనుక ఉండి చేయించిన హత్య, లాండ్ సెటిల్మెంటు డబ్బు పంపకాలు తెగక జరిగిన హత్య అని మాత్రమే అంటున్నారు.
అయితే స్వయంగా అవినాష్ రెడ్డికి అక్క అయ్యే వైఎస్ షర్మిల ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన తమ్ముడు చెబుతున్న మాటలన్నీ తుస్సుమనిపించేలా కొట్టి పారేశారు. ‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే’ అనే సామెత చందంగా.. తాను నిజం వైపు నిలబడతాను తప్ప.. తమ్ముడివైపు కాదని ఆమె చాటదలచుకున్నట్టుగా కనిపిస్తోంది.
తన బాబాయి వివేకా హత్య అనేది ఆస్తికోసం జరిగిన హత్య ఎట్టి పరిస్థితుల్లోనూ కాదని షర్మిల తేల్చిచెప్పారు. తన బాబాయి వివేకా చాలా కాలం కిందటే తన ఆస్తులన్నిటినీ సునీత పేరిట వీలునామా రాసిపెట్టారని చెప్పారు. వివేకా ఆస్తులన్నీ ఎప్పటినుంచో తన అక్క సునీత పేరిటే ఉన్నాయని ఆమె ధ్రువీకరించారు.
ఆమె మాటలను బట్టి.. వివేకాకు ఉన్న ఆస్తి కోసం సునీత ఆరాటపడాల్సిన అవసరమే లేదు. ఆ పరిస్థితి, అగత్యం వారికి లేదు. కేసు తన మీదికి మళ్లేసరికి ఎవరో ఒకరిని బుక్ చేయడమే లక్ష్యం అన్నట్టుగా అవినాష్ రెడ్డి మీడియా ముందు చెబుతున్న మాటలు చెల్లుబాటు కావనే సంగతి షర్మిల మాటలను బట్టి అర్థమవుతోంది. అదే సమయంలో.. అవినాష్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి.. వివేకా హత్యను సునీత-రాజశేఖర్ రెడ్డిలు చేయించినట్టుగా ఎంతగా గగ్గోలు పెడుతున్నప్పటికీ.. వారిద్దరి పాత్ర ఉందనే విషయంలో ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని సీబీఐ తెగేసి చెబుతున్న సంగతిని కూడా గమనించాల్సి ఉంది. ఒక అబద్ధాన్ని పదేపదే అరచి అరచి చెబితే.. సీబీఐను జడిపించవచ్చునని, జనాన్ని నమ్మించవచ్చునని అవినాష్ రెడ్డి అనుకోవచ్చు గానీ.. సాక్షాత్తూ ఆయన అక్క షర్మిల కూడా ఆయన ఆరోపణల్ని దారుణంగా ఖండిస్తున్న తరువాత.. ఆయన వేసిన నిందలు తుస్సుమంటున్నాయి. ఆయన కొత్త ఆరోపణలు వెతుక్కోవాల్సి ఉంటుంది.
తమ్ముడి ఆరోపణల్ని తుస్సుమనిపించిన షర్మిలక్క!
Wednesday, December 18, 2024