తెలంగాణలో కేసీఆర్ దూకుడు ప్రభావానికి ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభం, వివాదం, సమస్య ఏర్పడే పరిస్థితి చివరి నిమిపంలో తప్పింది. కేంద్రంమీద, ప్రధాని నరేంద్రమోదీ మీద తనకున్న ద్వేషాన్ని పదేపదే కక్కడానికి, రాష్ట్ర గవర్నరును పదేపదే ద్వేషించడం పనిగా పెట్టుకున్న కేసీఆర్.. గవర్నర్ కు సంబంధించిన వ్యవహారంలో ఒక పట్టాన తగ్గలేదు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా మరింత సీరియస్ పోరాటానికి, సీరియస్ రచ్చకు సిద్ధ పడ్డారు. తమిళిసైతో లడాయిని తారస్థాయికి తీసుకువెళ్లారు. హైకోర్టు దాకా వెళ్లారు. ఇంకోఅడుగు ముందుకే పడి ఉంటే ఎలాంటి చర్చ జరిగేదో తెలియదు గానీ.. హైకోర్టు సంయమనంతో వ్యవహరించడంతో వివాదం సమసింది. కేసీఆర్ దిగొచ్చారు. రాజీ కుదిరింది. కానీ ఇది తాత్కాలికం మాత్రమే!
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడినట్టే. బడ్జెట్ ను ఆమోదించని గవర్నర్ వైఖరిపై రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లిన తర్వాత.. ఈ ఇరు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తామెలా జోక్యం చేసుకోగలం అని హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. అదే సమయంలో రాజ్యాంగా ఉల్లంఘన జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని కూడా హైకోర్టు చెప్పింది. కానీ, హైకోర్టు సూచనల మేరకు ఇరుపక్షాలు చెరో మెట్టు దిగి వచ్చాయి.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నరు ప్రసంగం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వం దిగివచ్చింది. అలా అయితే.. బడ్జెట్ ను ఆమోదించడానికి కూడా అభ్యంతరం లేదని గవర్నరు తరఫు న్యాయవాది కూడా సెలవిచ్చారు. కానీ.. ఇది తాత్కాలికం మాత్రమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఎపిసోడ్ కు ఇప్పుడు వచ్చిన ముగింపు గవర్నర్ తో కేసీఆర్ రాజీ పడ్డట్టుగా అనుకుంటే పొరబాటే!బడ్జెట్ సమావేశాలు ఏ అవాంతరం లేకుండా సాగిపోవాలి కాబట్టి.. ఆయన ఒక మెట్టు దిగారు అని మాత్రమే అనుకోవాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి అనే సినిమా డైలాగులాంటి నీతిని అనుసరించినట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత.. మళ్లీ యథావిధిగా గవర్నరు కార్యాయలంతోనూ విభేదాలు కొనసాగుతాయనేది అందరి అంచనాగా ఉంది.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నరు ప్రసంగం తర్వాత ఈ వ్యవహారం ఇంతటితో సమసిపోతే అంతా బాగానే ఉంటుంది. కానీ, ఇది తన విజయం లాగా ప్రొజెక్టు చేసుకోవడానికి రాజకీయ నాయకురాలిలాగా వ్యవహరిస్తున్న తమిళిసై ప్రయత్నిస్తే మాత్రం ఈ వివాదం పార్ట్ 2 ఉంటుంది.
తమిళిసైతో లడాయి తారస్థాయికి.. దిగొచ్చిన కేసీఆర్!
Sunday, January 19, 2025