తప్పు దిద్దుకుంటాననే మాటల్లో చిత్తశుద్ధి ఉందా?

Sunday, January 19, 2025

‘‘ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా స్పందించకపోతే చెప్పండి.. మా దృష్టికి తీసుకురండి.. నేను బాధ్యత తీసుకుంటాను.. పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతాను.. మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను…’’ ఇలాంటి మాటలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వినిపించినప్పుడు ప్రజలు మురిసిపోవడం సహజం. అయితే ఆచరణలో ఈ మాటలకు- ఆయన వ్యవహార సరళకి పొంతన కుదురుతుందా? లేదా? అన్నది మాత్రమే ప్రశ్నార్ధకం.! కోస్తా జిల్లాలను ముంచెత్తిన వరదల పుణ్యమా అని, చాలా గ్యాప్ తర్వాత ప్రజల మధ్యకు వచ్చి, ప్రజలను కలిసి వారితో మాట్లాడి, వారి కష్టాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి- ఒకవైపు ‘వరద సహాయక చర్యలలో ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ చాలా అద్భుతంగా పనిచేశారు’ అని ముందస్తుగా తానే వారిని పొగిడేస్తూ… వారు సరిగా పరిచయకపోతే చెప్పండి లోపాలను సరిదిద్దుతాను అని ఒక మొక్కుబడి ప్రకటన చేయడం తమాషాగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- ‘ప్రభుత్వం పనితీరులో లోపాలు ఉంటే చెప్పండి.. సరిదిద్దుకుంటాం’ అని చెప్పిన మాటలు కేవలం వరద సహాయక చర్యల వరకు మాత్రమేనా? లేదా ప్రభుత్వ నిర్వహణలోని ఇతర విషయాలకు కూడా వర్తిస్తుందా? అనేది అనేక మందికి కలుగుతున్న సందేహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపే విషయంలో సైతం ఎంతో అనుభవజ్ఞులు, సీనియర్లు చెప్పిన సలహాలను కూడా చెవినవేసుకోరని, ఒంటెత్తు పోకడలతో ముందుకు సాగుతుంటారని అందరూ అంటుంటారు. తాను చెప్పిన మాట వేదంగా సాగాలని మాత్రమే కోరుకుంటారనేది జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీలో వినిపించే విమర్శ.

ప్రభుత్వ అధినేతగా కూడా ఆయన వ్యవహార సరళి ఇలాగే కనిపిస్తుంది. అనేక ప్రభుత్వ నిర్ణయాలు దూకుడుగా తీసుకున్నవి కాగా. వాటి విషయంలో హైకోర్టులు మొట్టికాయ వేసి తప్పు అని చెప్పినప్పుడు ఏ ఒక్క దానినీ వినిపించుకోకుండా సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం.. అక్కడ కూడా మొట్టికాయ పడిన తర్వాత మళ్లీ వెనక్కు తగ్గడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. శాసన వ్యవస్థకు నాయకుడైన ముఖ్యమంత్రి, రాజ్యాంగపరంగా తమతో సమానమైన న్యాయవ్యవస్థనే గౌరవించకుండా వారి సలహాలనే పట్టించుకోకుండా, ముందుకు సాగుతున్న నేపథ్యంలో… ‘తప్పులు జరిగితే చెప్పండి సరిదిద్దుకుంటాను’ అని ఆయన తన నోటితో అన్నంత మాత్రాన ఆ మాటలను ప్రజలు ఎలా నమ్మగలరు? అనే అభిప్రాయం పలువురులో కలుగుతుంది. తప్పుదిద్దుకుంటానని ప్రజలకు చెప్పేముందు, అసలు తప్పులు దిద్దుకునే అలవాటు తనకు ఉన్నదని జగన్మోహన్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles