తప్పు చేశానని లెంపలేసుకో.. హనుమ క్షమిస్తాడు!

Saturday, January 18, 2025

ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి ఇప్పుడు కొత్త కామెడీ మొదలైంది. ఈ సినిమా రచయిత  మనోజ్ ముంతాషిర్ శుక్లా.. ఈ సినిమాతో బహుశా తాను దేశంలో అతిపెద్ద సెలబ్రిటీ సినీ రచయితల్లో ఒకడుగా అయిపోతానని కలగని ఉంటాడు. సినిమా సర్వనాశనానికి తాను ప్రధాన కారకుడిగా తిట్లు దూషణలు వెల్లువెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలాగా చెలాయించడానికి అడ్డదారి వెతుక్కున్నట్టుగా కనిపిస్తోంది. తనకు ప్రాణహాని ఉన్నదంటూ ఆయన ముంబాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆదిపురుష్ సినిమా పట్ల యావత్ హిందూ సమాజంలో అసహ్యం వెల్లువెత్తుతోంది. హిందువుల్లో మితవాదులందరూ ఈ సినిమాను ఛీత్కరించుకుంటున్నారు. ఉచితంగా టికెట్లు వచ్చినా కూడా అ అసహ్యాన్ని చూడవద్దని అనుకుంటున్నారు. అదే సమయంలో హిందువుల్లో అతివాదులు.. ఓం రౌత్ అనే వాడు కనిపిస్తే కొట్టాలన్నంతగా రెచ్చిపోతున్నారు. ఏదో చిల్లర యానిమేషన్ సినిమాలు తీసుకోకుండా రామాయణ కథని ఎంచుకోవడం, వాల్మీకి రామాయణం ఆధారంగానే సినిమా తీస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించడం, సదరు వాల్మీకి రామాయణాన్ని అత్యంత ఘోరంగా భ్రష్టుపట్టించడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఓం రౌత్ ను చంపడానికి మనుషుల్ని పురమాయిస్తామంటూ కొందరు బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది.

అయితే రామాయణం.. ఆదిపురుష్ రూపంలో సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన కారకులుగా ఓం రౌత్ కు ఎంత పాత్ర ఉన్నదో, రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లాకు కూడా అంతే పాత్ర ఉంది. తనకు తోచిన చెత్తనంతా రాసేసి, గ్రామాల్లో జానపదులు, అమ్మమ్మలు రామాయణ కథ ఇలాగే చెబుతారని అనడం మనోజ్ పొగరుకు నిదర్శనం. వివాదాస్పదమైన నీచపు డైలాగులను తొలగించడానికి/ మార్చడానికి అంగీకరించిన తర్వాత కూడా.. ఆయన పెట్టిన ట్వీట్లు చాలా అహంకారంగానే ఉన్నాయి. నేను రాముణ్ని పొగుడుతూ చాలా రాశాను.. కొన్ని మాత్రం నన్ను వ్యతిరేకించే వారికి నచ్చడం లేదు.. నన్ను తిట్టే వాళ్ల ఊహలకు తగ్గట్టుగా నేను రాయలేదు.. అంటూ అహంకారంగా మాట్లాడారు. ఆ మాటకొస్తే ఈ విషయంలో ఓం రౌత్ బెటర్! సినిమా నాశనం అయ్యాక.. మౌనంగా ఉండిపోయారు. తనను సమర్థించుకోవడానికి చెత్తవాదనల్ని ముందుకు తేవడం లేదు.

తప్పుచేసిన తర్వాత కూడా అహంకారంగా మాట్లాడుతున్న రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా.. తాజాగా తనకు ప్రాణహాని ఉన్నదని పోలీసులను ఆశ్రయించడం తమాషా! ఈ అహంకారాన్ని వీడి.. తన వల్ల తప్పు జరిగిపోయిందని, హిందూసమాజాన్ని క్షమాపణ కోరిఉంటే సరిపోయేది. రాముడి పట్ల, హనుమంతుడి పట్ల జరిగిన తప్పును ఒప్పుకుని లెంపలు వేసుకుని ఉంటే సరిపోయేది రాముడే కాదు, హిందూ సమాజం కూడా క్షమించేసేది. కానీ పోలీసులను ఆశ్రయించడం ద్వారా.. తాను ఇంకా పెద్ద హీరో అవుతానని మనోజ్ అనుకున్నట్లుగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles