వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రోజు రోజుకు భయం పెరుగుతోంది. విపక్షాలు చాలా యాక్టివేట్ అవుతున్నాయి. ప్రజలతో మమేకం అవుతున్నాయి. వారి నుంచి సమస్యలు తెలుసుకుంటున్నాయి. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి నేపషథ్యంలో విపక్షాలతో కలిసి తమ ప్రభుత్వం లోపాలను ప్రశ్నిస్తే చాలు.. వైసీపీ నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. ఓర్వలేకపోతున్నారు. వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలో ఇటీవల తెలుగుదేశం పార్టీ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించింది. ఓ మహిళ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. సమస్యలను ఏకరవు పెట్టింది. అయితే దీనిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గుస్సా అయ్యారు. ఆమె గురించి వివరాలుసేకరించారు. ఆమె భర్త పంచాయతీలో పంపు ఆపరేటర్ గా పనిచేస్తుండగా.. ఆ విధుల్లోంచి తొలగించాలని ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టినందుకే.. ప్రజలను కూడా శత్రువుల్లాగా పరిగణిస్తూ.. టార్గెట్ చేస్తే అది ఎలాంటి పరిపాలన అనిపించుకుంటుంది?
ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొంది కూడా సీఎంను విమర్శిస్తున్నారంటూ నల్లపురెడ్డి ఆగ్రహించారు. అయినా ఇక్కడ ఓ సంగతి గమనించాల్సి ఉంది. ప్రభుత్వ పథకాలు పొంది, పొందలేని చెబితే తప్పు అవుతుంది గానీ.. ప్రభుత్వంతో ఉన్న ఇతర సమస్యల గురించి చెప్పడం కూడా తప్పు ఎలా అనిపించుకుంటుంది. కానీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఒక్క మాట వినిపించడాన్ని కూడా సహించలేకపోతోంది.
సాధారణంగా మనం రాజకీయాల్లో మా పార్టీకి ఓట్లు వేస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని బతిమాలే ధోరణుల్ని చూస్తాం. మాకు ఓట్లు వేయండి.. మీకు ఫలానా పథకాలు ఇస్తాం అనే తాయిలాల రాజకీయాల్ని చూస్తాం. కానీ.. మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సరే.. మీ అంతుచూస్తాం అనే తరహాలో నాయకులు రెచ్చిపోవడం అనేది మాత్రం తక్కువగా కనిపిస్తుంది. అది వైసీపీ నాయకుల, ఎమ్మెల్యేల తీరులో కనిపిస్తోంది.
ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లయితే దానిని బయటకు రానివ్వకుండా ఇలాంటి వేధింపులు, టార్గెట్ చేసే చర్యలతో తొక్కేస్తే ఏమవుతుంది. ఆ అసంతృప్తి అలా పెరిగి పెరిగి ఎన్నికల్లోనే బయటపడుతుంది. అలా కాకుండా.. వ్యతిరేకతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..దానిని తగ్గించడానికి అనుగుణంగా పాలన విధానాలు మార్చుకుంటే వారికి భవిష్యత్తు ఉంటుంది. కానీ.. ఇలాంటి దుర్మార్గ చర్యల ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ వినాశనానికే బాటలు వేస్తున్నట్టున్నారు.
తప్పులు చెబితే.. టార్గెట్ చేస్తున్న సర్కార్!
Thursday, November 14, 2024