తన పరువు తానే తీసుకోబోతున్న  జగన్!

Wednesday, January 22, 2025

ప్రతిపక్ష నాయకుల మీద నిరంతరం బురద చల్లుతూ ఉండడానికి ఒక సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఎత్తుగడ వేసిన ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు తీర్పురూపంలో ఎదురుదెబ్బ చాలా గట్టిగానే తగిలింది. దెబ్బ ఎంత గట్టిగా తగిలినప్పటికీ ఆయన ఆలోచన సరళిలో మాత్రం మార్పు వస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఇంకాస్త దూకుడు, అసహనం ప్రదర్శించి తన పరువు తానే తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతుంది.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ కింద 1400 ఎకరాలను ప్రత్యేకంగా విడదీసి ఎక్కడెక్కడ నుంచో పేదలను తీసుకువచ్చి వారికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తాం అని ప్రకటించడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుట్రలలో ఒకటి. 50 వేలకు పైగా లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు వంతున ఇంటి స్థలాలు కేటాయించడం ద్వారా అమరావతి పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్షన్నర ఓట్లను తమ పార్టీకి పదిలం చేసుకోవాలనేది జగన్ ప్రభుత్వం ఆలోచన. అమరావతి ప్రాంతానికి చెందిన ప్రతి వ్యక్తి అక్కడ రాజధాని స్వప్నాన్ని, నిర్మాణాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ ఇంటి స్థలాలు ఇచ్చి ఓటు బ్యాంకు ను కూడా నిర్మించుకోవాలని జగన్ ఆలోచించారు. అయితే ఈ కుట్ర పూరిత ఆలోచనకు కోర్టుపరంగా బ్రేకులు పడ్డాయి.

జగన్ మాత్రం తన దూకుడు దక్కి తగ్గించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి వారి నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని 50వేల పైచిలుకు లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు వంతున ఇంటి స్థలాలను పంపిణీ చేసేశారు. అయితే అమరావతి రైతులతో ఒప్పందంలో భాగంగానే ఇంకా ఉన్నటువంటి ఈ భూములపై వేరే వ్యక్తులకు యాజమాన్య హక్కులు కల్పించేలా పంచి పెట్టడం కుదురుతుందా లేదా అనే అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు తుది తీర్పు ఇచ్చేవరకు పేదలకు ఇంటి స్థలాలపై యాజమాన్య హక్కులు కల్పించడానికి వీల్లేదని, కావలిస్తే పట్టాల పంపిణీ మాత్రం చేయవచ్చునని సుప్రీం సూచించింది. స్థలం పొందిన వారికి దానిమీద పూర్తిస్థాయి యాజమాన్య హక్కులే లేకపోగా ఆ స్థలాలలో ఏకంగా ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి జగన్ మరో అర్థంలేని ప్రయత్నాన్ని ప్రారంభించారు.

ఈ ఇళ్ల నిర్మాణంపై కూడా హైకోర్టు తాజాగా స్టే విధించింది. తాను పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే విపక్ష పార్టీలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని బురద చల్లడానికి ఈ తీర్పు ద్వారా జగన్ కు వీలవుతుంది. అయితే ప్రభుత్వం తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద సుప్రీం కు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. తుది తీర్పు వచ్చేదాకా యాజమాన్య హక్కులనే ఇవ్వద్దని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు అవే స్థలాల్లో ఇళ్లు నిర్మించడానికి ఒప్పుకుంటుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిందనే ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి ఆవేశంగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బ తప్పదని పలువురు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చర్య ద్వారా తన పరువు తానే తీసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles