అవినాష్ రెడ్డి అరెస్టు భయంతో హైకోర్టును ఆశ్రయించి, ప్రస్తుతానికి ఉపశమనం పొందారు. ఫిబ్రవరి 24వ తేదీన విచారణ చేసినప్పుడే.. అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సీబీఐ కోర్టులో వెల్లడించడాన్ని గమనిస్తే.. శుక్రవారం ఆయన అరెస్టు జరిగి ఉండేదేమో అని అనిపిస్తుంది. అలా జరుగుతందని ముందే గ్రహించినట్టుగా.. సకాలంలో కోర్టు తలుపులు తట్టిన అవినాష్ రెడ్డి.. అరెస్టు జరగకుండా హైకోర్టు ఉత్తర్వులు పొందారు. కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. 13వ వరకు తీవ్ర చర్యలు వద్దు అని చెప్పిన కోర్టు, ఆ రోజున మళ్లీ వాదనలు విననుంది. 14 న మరోసారి విచారణకు రావాలని సీబీఐ అవినాష్ రెడ్డికి సూచించింది. ఆరోజు అరెస్టు జరగవచ్చుననేది ఒక అంచనా.
అయితే ఈలోగా తనను తాను సచ్ఛీలుడిగా నిరూపించుకోవడానికి అవినాష్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో మీడియాతో పెద్దగా మాట్లాడిన సందర్భాలు తక్కువ.అయితే సీబీఐ ఆయనను నేరుగా పిలవడం మొదలైన దగ్గరినుంచి ఆయన తరచుగా మాట్లాడుతున్నారు. తనకు అసలేమీ తెలియదని తనను సీబీఐ అధికారులు కుట్రపూరితంగా ఇరికించాలని చూస్తున్నారని అవినాష్ అంటున్నారు. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా తాను ఎవరితోనూ చెప్పలేదని కూడా ఆయన అంటున్నారు.
వివేకాహత్యతో తనకు సంబంధం లేదని చాటుకోవడానికి ఆయన వివేకా కుటుంబ సభ్యుల మీదికే ఆరోపణలు నెడుతున్నారు. వివేకా రెండో పెళ్లి అంశం ఇందులో ప్రధానం. వివేకా రెండో పెళ్లి చేసుకున్నారని, ఆ పెళ్లి ద్వారా పుట్టిన కొడుకునే తన ఆస్తులకు వారసుడిగా చేయాలని అనుకున్నాడని, ఇది నచ్చక ఆయన కుటుంబ సభ్యులే హత్య చేయించారని, ఇది పూర్తిగా ఆస్తి గొడవ వల్ల జరిగిన హత్య అని అవినాష్ అంటున్నారు. వివేకా రాసిన లేఖను సీబీఐ పట్టించుకోవడం లేదని అంటున్నారు. కోర్టులో ఆయన న్యాయవాదులు చెబుతున్న కొన్ని విషయాలు కూడా లోతుగా గమనిస్తే ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి.
లేఖను సీబీఐ ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపింది. అది వివేకాతో బలవంతంగా రాయించిన లేఖగా తేలినట్లు కోర్టులో స్పష్టం చేసింది.
వివేకా వాచ్‌మన్ రంగన్న నలుగురు నిందితులను గుర్తించినట్టుగా అవినాష్ న్యాయవాది కోర్టులో చెప్పారు. వారిలో దస్తగిరి గొడ్డలి కొన్నట్టుగా ఒప్పుకోవడాన్ని కూడా ప్రస్తావించారు. సో, వివేకా హత్యలో ఆ నలుగురి పాత్రను అవినాష్ వర్గం ధ్రువీకరిస్తున్నట్టే. అదే నిజమైతే ఆ నలుగురితో వివేకా కుటుంబానికి సంబంధం ఉందని నిరూపణ అయితే తప్ప ఆ వాదన నిలబడదు. అదే సమయంలో.. ఆ నలుగురికీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డితో ఆ రోజుల వ్యవధిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగానే ఫోన్ రికార్డులు తదితర వివరాలు వల్ల తెలుస్తోంది.
గూగుల్ టేకౌట్ ను అవినాష్ తెదేపా టేకౌట్ అంటూ ఎద్దేవా చేయవచ్చు గానీ, అంతమాత్రాన దానిని సాక్ష్యంగా కొట్టి పారేయడానికి వీల్లేదు. వాచ్ మన్ గుర్తించిన నిందితులే హత్య చేశారని దాదాపుగా అంగీకరిస్తున్నప్పుడు.. వారిలో కొందరు అవినాష్ ఇంట్లోనే ఉన్నారనే సంగతిని ఆయన విస్మరించలేరు. ఈ రకంగా చూసినప్పుడు.. అవినాష్ రెడ్డి మరియు ఆయన న్యాయవాదులు చెబుతున్న మాటలు.. వారి వైపే వేలెత్తి చూపే పరిస్థితిని కల్పిస్తున్నాయని అనిపిస్తోంది.
తనను తానే ఇరికించుకుంటున్న అవినాష్ రెడ్డి!
Saturday, November 23, 2024