తగ్గేదే లే : ఆ భూములపై గులాబీ కన్ను!

Wednesday, January 22, 2025

సికింద్రాబాద్ లోని సైనిక భూములపై భారాసకు కన్నుంది. కేసీఆర్ మొదటి సారి సీఎం అయినప్పుడే.. రక్షణ శాఖ పరిధిలో ఉండే ఈ భూములను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా అప్పటినుంచి మంతనాలు సాగించారు. కానీ.. రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వడం అనేది ఒక పట్టాన తేలే వ్యవహారం కాదు. అప్పటినుంచి ఇది పెండింగులోనే ఉంది. అలా అనడం కంటే.. ఈ ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడం లేదనడం సబబుగా ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి అక్కడి కేంద్రమంత్రులను కలిశారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. సికింద్రాబాద్ లోని సైనిక భూములను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. కేంద్రం రక్షణ శాఖ భూములను ఇస్తే వాటివిలువకుసమానమైన భూములను కేంద్రానికి మరోచోట కేటాయిస్తామని కేటీఆర్ ప్రకటించారు.

అయితే, తాము నగరాన్ని అన్ని రకాలుగానూ అభివృద్ధి చేయాలని అనుకుంటూ ఉండగా.. కేంద్రం అడ్డుపడుతోందని, రక్షణ శాఖ భూములను తమకు ఇవ్వకుండా ఆటంకాలు సృష్టిస్తున్నదని ఆరోపణలు చేయడానికి ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుందే తప్ప.. భూముల బదలాయింపు అనేది అంత సులువైన వ్యవహారం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు.  

కేంద్రాన్ని నిందించేలాగా.. కేటీఆర్ చాలా చక్కగా తన వాదనను వినిపించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు. నగరం అన్నివైపులా అభివృద్ధి చెందుతుండగా.. కంటోన్మెంట్ భూములు ఉన్న ప్రాంతాల్లో మాత్రం పనులు చేయలేకపోతున్నామని ఆయన అంటున్నారు. రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి అనుకూలంగా రక్షణ శాఖ భూములు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఒక హైవే ఉన్న వైపు 96 ఎకరాలు, మరో వైపు 56 ఎకరాలు సైనిక భూములు అడగడం విశేషం.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈ సైనిక భూముల కోసం రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు కొత్త సెక్రటేరియేట్ కట్టాలని అప్పటినుంచి అనుకుంటున్న కేసీఆర్.. అందుకోసం మిలిటరీ ఆధీనంలోని పెరేడ్ గ్రౌండ్స్ స్థలాన్ని తమకు కేటాయించాలని కూడా గతంలోనే కోరడం జరిగింది. పలుదఫాలుగా కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చారుగానీ.. కేంద్రం వాటిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

అయినా ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక సందేహం కలుగుతోంది. సైనిక భూములను వందల ఎకరాలు తమకు ఇచ్చేయమని అడగకుండా.. స్కైవేలు నిర్మించుకునే మార్గాలను అన్వేషిస్తే ఎలా ఉంటుందనే మాట వినిపిస్తోంది. అలాగే.. కేవలం ఆ భూమికి సమానమైన భూమిని మరొకచోట ఇస్తాం అనే ప్రతిపాదన ద్వారా.. తెలంగాణ సర్కారు ఎప్పటికీ కేంద్రంనుంచి సైనిక భూములను తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చునని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles