వైఎస్ అవినాష్ రెడ్డి కడప నియోజకవర్గం ఎంపీ! ప్రజాప్రతినిధిగా గట్టి అధికారం చేతిలో ఉన్న వ్యక్తి. భాస్కరరెడ్డి ఆయన తండ్రి. పార్టీ రాజకీయాలకు మాత్రం పరిమితమైన నాయకుడు. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రభావశీలమైన వ్యక్తి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగడానికి అడ్డుపడగలగడంలో ఎవరు ఎక్కువ ప్రమాదకారి? అనే చర్చ ఇప్పుడు రేకెత్తుతోంది. ఎందుకంటే.. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం, దానిని సవాలు చేస్తూ సుప్రీంలో సునీత పిటిషన్ దాఖలు చేయడం, అదే సమయంలో తండ్రి భాస్కరరెడ్డికి బెయిలు విషయంలో సీబీఐ లేవనెత్తుతున్న అభ్యంతరాలు కలిపి ఇలాంటి అనుమానం కలిగిస్తున్నాయి.
ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న నిందితులుగా సీబీఐ కూడా చెప్పడం లేదు గనుక.. వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది. ఆయనను కస్టడీలో ఉంచుకునే విచారించాల్సిన అవసరం కనిపించడం లేదని కోర్టు భావించింది. సీబీఐ విచారణకు సహకరించమని చెప్పింది. అవినాష్ కు ముందస్తు బెయిల్ వచ్చిన సమయంలోనే వైసీపీ శ్రేణులంతా పండగ చేసుకున్నారు. జైల్లో ఉన్న అవినాష్ తండ్రి భాస్కరరెడ్డి మీద అభియోగాలు కూడా ఇంచుమించు అలాంటివే కాబట్టి.. ఆయనకు కూడా చిటికెలో బెయిల్ వచ్చేస్తుందని వారు అనుకున్నారు.
అయితే సీబీఐ ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉంది. భాస్కరరెడ్డి బయట ఉన్నట్లయితే.. సాక్షులు ఎవ్వరూ నిజాలు చెప్పడానికి ముందుకు రారని, ఆయన వారిని భయపెడతారని కోర్టు ఎదుట వాదిస్తోంది. వివేకా హత్య తర్వాత రక్తపుమరకలను తుడిచివేయించడంలో భాస్కరరెడ్డిదే కీలకపాత్ర అని సీబీఐ చెప్తోంది. ఇనాయతుల్లా ఫోటోలు తీసి సునీతకు పంపారు గనుక.. రక్తపు మరకలు చెరపివేశారనే ప్రశ్న తలెత్తదని భాస్కరరెడ్డి న్యాయవాది కోర్టు ఎదుట చెప్పారు. సునీతకు ఫోటోలు పంపినంత మాత్రాన రక్తపుమరకలను తుడిచేయవచ్చా? పోలీసుల కోసం ఆగనక్కర్లేదా? అనేది సామాన్యులకు కలిగే ప్రశ్న.
అయితే, జైలు బయట ఉంటే సాక్షులను భయపెడతారని, భాస్కరరెడ్డి విషయంలో సీబీఐ చేస్తున్న వాదన, తండ్రి కంటె బలవంతుడు, అధికారం కూడా చేతిలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కదా అనేది ప్రజల సందేహం. అవినాష్ రెడ్డి బయట ఉన్నా కూడా సాక్షులను భయపెట్టడమో, ప్రభావితం చేయడమో జరుగుతుంది కదా అని అనుకుంటున్నారు. అవినాష్ బెయిల్ రద్దు కోరుతున్న సునీత పిటిషన్ సుప్రీం కోర్టు ఎదుటకు రానున్న తరుణంలో వారు ఈ సంగతిని కీలకంగా పరిగణిస్తారని, అవినాష్ అరెస్టు అనేది కేవలం కస్టోడియల్ విచారణ కోసం మాత్రమే కాదని, ఆయన బయట ఉండి కేసు విచారణను ప్రభావితం చేయకుండా ఉండడం కోసమే అనే వాదన కోర్టు ఎదుటకు వెళుతుందని పలువురు అనుకుంటున్నారు.
తండ్రీ కొడుకుల్లో ఎక్కువ ప్రమాదకారి ఎవరు?
Saturday, January 18, 2025