ఆయన కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికే చెందిన ప్రత్యర్థి పార్టీ నాయకుడు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. వైఎస్ కుటుంబానికి కొరుకుడు పడని ప్రత్యర్థి పార్టీ నాయకుడిగానే కొనసాగుతున్నాడు. అయితే.. ఆ నాయకుడి పట్ల తండ్రీకొడుకుల వ్యవహారసరళి పూర్తి భిన్నంగా సాగడమే తమాషా. సదరు తెలుగుదేశం నాయకుడు మరెవ్వరో కాదు.. మారెడ్డి రవీంద్రనాధ రెడ్డి అలియాస్ బీటెక్ రవి.
బీటెక్ రవి ఇవాళ చిన్నస్థాయి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న రోజుల్లోనే, 2006లోనే ఆయనకు అప్పటి వైఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు 1+1 భద్రత కల్పించారు. ఫ్యాక్షన్ తగాదాలు, దాడులు, కొట్లాటల క్రైమ్ రేట్ అధికంగా ఉండే కడప జిల్లాలో తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడే అయినప్పటికీ బీటెక్ రవికి అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం భద్రత కల్పించింది.
ఆ తర్వాత బీటెక్ రవి పులివెందులో ఎమ్మెల్యేగా కూడా వైఎస్ విజయమ్మ మీదనే పోటీచేశారు. తెలుగుదేశం హయాంలో కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున వైఎస్ వివేకానందరెడ్డి పోటీచేయగా, బీటెక్ రవి ఆయనతో తలపడ్డారు. ఒక రకంగా జిల్లాలో స్థానికసంస్థల ప్రతినిధుల్లో అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ కు బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. జగన్ బాబాయి వివేకానందరెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర రెడ్డి ఆయన ఓటమికి ప్రయత్నించడంవల్లనే ఓడిపోయినట్లు పుకార్లున్నాయి. మొత్తానికి బీటెక్ రవి ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత ఆయనకు తెలుగుదేశం ప్రభుత్వం 2+2 భద్రత కల్పించింది. ఇప్పుడు మార్చి 29వ తేదీనాటికి బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఇప్పుడు ఆయనకున్న భద్రతను తొలగిస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కడప జిల్లాలో తెలుగుదేశానికి కీలక నాయకుల్లో ఒకరైన రవికి భద్రత తొలగించడం అనేది ప్రభుత్వం పిరికిచర్యగా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ జమానానుంచి కలిగి ఉన్న పోలీసు భద్రతను, జగన్మోహన్ రెడ్డి సర్కారు తొలగించడం, ఇప్పుడు జిల్లాలో రాజకీయ, శాంతి భద్రతల పరిస్థితులు మరింత దిగజారిన స్థితిలో తొలగించడం అనేది ఒక ప్లాన్ గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఆయన కాన్వాయ్ పై దుండగులు దాడిచేసిన సందర్భాన్ని కూడా ఉదాహరిస్తున్నారు. చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా డీజీపీకి లేఖ రాస్తూ.. బీటెక్ రవి భద్రత పునరుద్ధరించాలని కోరారు గానీ.. ప్రభుత్వం ఏమేరకు సానుకూలంగా స్పందిస్తుందో చూడాలి.
తండ్రి భద్రత కల్పిస్తే.. కొడుకు తొలగించేశాడు..
Wednesday, January 22, 2025