చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్రమైన రాజకీయం కనిపిస్తోంది. రకరకాల అక్రమాలు భూబాగోతాలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలతో రకరకాలుగా భ్రష్టు పట్టిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో తనకు ఓటమి తప్పదనే సంగతిని చాలా ముందుగానే గ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వీర విధేయులలో ఒకరైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. వచ్చే ఎన్నికలలో చంద్రగిరి సీటును తనకు కాకుండా తన కొడుకుకు కేటాయించాల్సిందిగా సీఎం జగన్ తో విన్నవించుకున్నారు.
ఎమ్మెల్యేలతో నిర్వహించిన ప్రతి సమావేశంలోనూ, 2024 ఎన్నికలలో వారసులను బరిలోకి దించడానికి తాను అనుమతించేది లేదని.. ఇపుడున్న టీం యధాతధంగా మళ్ళీ బరిలోకి దిగాల్సిందేనని చెబుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి.. చెవిరెడ్డి విషయంలో మాత్రం రాజీ పడ్డారు! చెవిరెడ్డి తనయుడు ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్న మోహిత్ రెడ్డి కి టికెట్ ఇవ్వడానికి జగన్ అంగీకరించారు. చెవిరెడ్డి సేవలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఉపయోగించుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో చాన్నాళ్లుగా ఎమ్మెల్యే స్థాయి పార్టీ కార్యక్రమాలు అన్నీ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. నిజానికి గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా మోహిత్ రెడ్డి నిర్వహిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తండ్రి భాస్కర్ రెడ్డి పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీద కూడా ప్రతిఫలిస్తూనే ఉంది. గ్రామాలలో పర్యటిస్తున్న మోహిత్ రెడ్డికి సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ తగులుతుంది.
డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని నాలుగేళ్లుగా కోరుతున్నప్పటికీ ఎమ్మెల్యే ఇప్పటిదాకా పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మోహిత్ రెడ్డిని అడ్డుకున్నారు. తమ సమస్యను పరిష్కరించిన తర్వాత మాత్రమే ముందుకెళ్లాలని వారు పట్టుపట్టారు. నయానా భయానా సిఐ వారిని అడ్డు తొలగించినప్పటికీ.. కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న మోహిత్ రెడ్డిని మళ్లీ అడ్డుకుని, కారు కదలనివ్వబోమని భీష్మించుకున్నారు. దీంతో కారు దిగి డ్రైనేజీని పరిశీలించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆక్రమణలు తొలగించి కాలువ నిర్మించాలని స్థానిక అధికారులకు సూచించడంతో అప్పటి గొడవ సద్దుమణిగింది.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేవలం తన పట్ల నియోజకవర్గంలో విపరీతంగా వ్యతిరేకత జరిగిందనే ఉద్దేశంతోనే మొహం చాటేసి తాడేపల్లికి పరిమితమయ్యారు. అయినా జగన్ వద్ద ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తన కొడుకు మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోగలరు గాని.. దాని ద్వారా తన పట్ల ఉన్న ప్రజా వ్యతిరేకతను ఎలా దూరం చేయగలరు? ఈ లాజిక్ ను చెవిరెడ్డి కుటుంబం మిస్ అయినట్లుగా ఉంది. వారు రకరకాల ఎత్తుగడలతో కొడుకును రంగంలోకి దించినా సరే.. తండ్రి పట్ల ఉన్న వ్యతిరేకత గెలుపును దూరం చేస్తుందని చంద్రగిరి ప్రజలు అంటున్నారు.