ఢిల్లీ తర్వాత.. పవన్ పొత్తు ప్రకటన త్వరలోనే!

Friday, September 20, 2024

ఏపీలో ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయం అనేది అచ్చంగా ఒక సినిమా స్క్రిప్టులాగా ఉంది. ప్రేమ సినిమా అనుకోండి- హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు. తర్వాత వారికి ఒక సమస్య వస్తుంది. లేదా అపోహలతో బ్రేకప్ అవుతారు. కథ పాకంలో పడుతుంది. క్లయిమాక్స్ వచ్చేసరికి హీరో హీరోయిన్ కలుస్తారనే సంగతి ప్రేక్షకుడికి సినిమా ప్రారంభంలోనే తెలుసు. కానీ, ‘ఎలా’ కలుస్తారు.. అనేది తెలుసుకోవడం కోసం రెండుగంటలు సినిమా చూస్తాడు. యాక్షన్ సినిమా అయినా అంతే. విలన్ మీద హీరో విజయం సాధించడం తథ్యం. కానీ, ఎలా? ఎప్పుడు? అనేదానికోసమే మనం సినిమా చూడాలి. ఏపీలో విపక్ష రాజకీయాల పరిస్థితి అదే.
జగన్ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అని ప్రకటించేసిన పవన్ కల్యాణ్.. తెలుగుదేశంతో జత కలుస్తారు అనేది ఖరారు. రెండు పార్టీలు కూడా తదనుగుణమైన సంకేతాలను అందిస్తున్నాయి. అయితే ఎప్పుడు కలుస్తారు? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అనేది మాత్రం ఇదమిత్థంగా తేలలేదు. ఇప్పుడు అది కూడా కొన్ని వారాల వ్యవధిలోనే తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ టూర్ తర్వాత.. పవన్ కల్యాణ్ కు భాజపాతో సంబంధాలపై ఒక క్లారిటీ వచ్చిందని, దానిని బట్టి.. తెలుగుదేశంతో పొత్తు గురించి ఆయన స్పష్టమైన ప్రకటన రోజుల వ్యవధిలోనే చేయబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పవన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. బిజెపి పెద్దలు పలువురిని కలిశారు. కొందరిని కలవలేకపోయారు. అయితే మద్యలో ప్రతిచోటా విలేకరులు ప్రశ్నిస్తోంటే.. అందరినీ కలిసిన తర్వాత.. డీటెయిల్డుగా చెబుతానని కూడా అన్నారు. అన్నమాట ప్రకారం.. పర్యటన ముగిసన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. భాజపా అగ్రనేతలతో చర్చలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి అని పవన్ కల్యాణ్ నర్మగర్భంగా చెప్పారు. అంతే తప్ప.. తెలుగుదేశం కూటమిలోకి బిజెపి వస్తుందని ఖరారు చేయలేదు. పవన్ తో ఒక్క సమావేశంలోనే బిజెపి వంటి పెద్ద పార్టీ నాయకులు ఒక రాష్ట్రంలో పొత్తులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసేసుకుంటారని అనుకోలేం. ఢిల్లీ పెద్దలు మరికొంత మల్లగుల్లాలు పడిన తర్వాత.. దీనిపై స్పష్టత రావొచ్చు.
అయితే పవన్ తన వైఖరి గురించి వారికి క్లారిటీ ఇచ్చేశారని, వారి నిర్ణయంతో సంబంధం లేకుండా తెలుగుదేశంతో కలిసి వెళ్లబోతున్నట్టు భాగస్వామి పార్టీ గనుక ముందు వారికి సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ పర్వం ముగిసింది గనుక.. తెలుగుదేశంతో పొత్తు గురించి త్వరలోనే రోజులు లేదా వారాల వ్యవధిలోనే అధికారిక ప్రకటన ఉంటుందని కూడా చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles