ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రమైన నాయకుడు. తన సంక్షేమం మాత్రమే తనను గెలిపిస్తుందని అంటారు. మళ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల దొడ్డిదార్లను ఆశ్రయిస్తారు. ఎన్నికలలో ఓటమి గురించి అన్ని రకాల భయాలకు గురవుతుంటారు. మరి ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదు.
ఎన్నికల్లో సంక్షేమంతో గెలుస్తాం అంటూనే.. వాలంటీర్లను ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగేలా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అంటూనే ప్రత్యర్థి పార్టీలు నిరసనలు, ఉద్యమాలు చేసేప్పుడు వాటిని ఉక్కుపాదంతో అణిచేస్తారు. గళమెత్తనివ్వకుండా తొక్కేస్తారు. దారుణంగా వ్యవహరిస్తారు. ఇన్నిరకాల వైరుధ్యాలతో వ్యవహరించే జగన్ సర్కారు ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుంది. టీచర్లకు బోధనేతర డ్యూటీలు వేయకూడదనేది ఆ నిర్ణయం.
ఏపీలో ఉపాధ్యాయ వర్గం మొత్తం.. ప్రభుత్వం మీద విపరీతంగా ఆగ్రహంతో ఉడికిపోతున్న సంగతి అందరికీ తెలుసు. పీఆర్సీ విషయంలో జరిగిన మోసానికి ద్రోహానికి మిగిలిన ఉద్యోగ సంఘాలు రాజీపడినా, టీచర్లు తమ పోరు కొనసాగించారు. వారి పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించింది. అప్పటినుంచి టీచర్ల మీద కక్ష కట్టింది. నిబంధనలు మార్చింది. టీచర్లను వేధించడమే లక్ష్యంగా ప్రతి ప్రభుత్వ నిర్ణయం ఉంటోందనే అభిప్రాయాలు కూడా పలువురిలో ఉంటున్నాయి. అదే సమయంలో.. పాఠశాల విద్యకు సంబంధించి వీడియో పాఠాలు బోధించడం కోసం బైజూస్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది టీచర్ల వ్యవస్థను, బడిలో బోధనను దారుణంగా అవమానించడమే. టీచర్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి అవమానపరుస్తుంది. ఇన్ని పనుల మధ్య టీచర్లనుంచి తమకు మద్దతు లభిస్తుందని జగన్ కు ఆశ లేదు. వారు ఎన్నికల డ్యూటీలకు వస్తే.. పనిగట్టుకుని ప్రత్యర్థి పార్టీలకు ఓట్లు వేయిస్తారని భయపడ్డారో ఏమోగానీ.. టీచర్లకు అసలు ఎలక్షన్ డ్యూటీలు వేయకుండా నిబంధనలు మార్చేశారు.
కానీ.. జగన్ తెలుసుకోవాల్సింది. సమాజంలో ఒపీనియన్ మేకర్స్ అని ఒక వర్గం ఉంటారు. వీరి విలువ కేవలం ఒక్క ఓటు కాదు. కొన్ని వందల వేల ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు ఈ కోవకు చెందుతారు. అలాంటి ఒపీనియన్ మేకర్స్ ను ఎన్నికల బూత్ లోకి రానివ్వకుండా అడ్డుపడినంత మాత్రాన తనకు జరిగే నష్టం ఆగిపోతుందని అనుకుంటే భ్రమే. ఎన్నికల బూత్ లో డ్యూటీలో కూర్చుంటే మహా అయితే పదుల ఓట్లను టీచర్లు మానిప్యులేట్ చేస్తారేమో.. కానీ వారు బూత్ బయట ఉంటే వందల ఓట్లను జగన్ కు వ్యతిరేకంగా కూడగట్టగలరు.. ఆ సంగతి ఆయన తెలుసుకోవాలి.
డ్యూటీ వేయకపోయినా ఓడించి తీరుతారు!
Saturday, January 4, 2025