తీగలాగితే డొంక కదులుతుందనేది సామెత. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పర్వం ఇంకా ఏదశలో ఉన్నదో ఎవ్వరికీ క్లారిటీ లేదు .సుదీర్ఘకాలంగా విచారణ సాగుతున్నప్పటికీ.. కేసు విచారణ పులివెందుల నుంచి హైదరాబాదుకు సుప్రీం కోర్టు ద్వారా బదిలీ అయిన తర్వాత మాత్రమే అంతో ఇంతో వేగం పుంజుకుంది. ఇటీవలే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఒకసారి విచారించడం పూర్తయింది. చూడబోతే అవినాష్ విచారణ తర్వాత.. డొంక కదులుతున్నట్టుగా కనిపిస్తోంది.
వివేకాహత్య కేసు విచారణకు సంబంధించి తొలిసారి ‘సీఎం’ అనే పదం వినిపించేలా విచారణ పర్వంలో అడుగులు పడుతున్నాయి. సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఓ పవర్ ఫుల్ వ్యక్తి పాత్రను తేల్చేలా సీబీఐ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తికి కూడా నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
సీఎం క్యాంపు ఆఫీసులో చాలా కీలకమైన వ్యక్తికి సహాయకుడిగా ఉండే నవీన్ కు నోటీసులు ఇచ్చారు.
ఎంపీ అవినాష్ రెడ్డి , ఆ నవీన్ అనే వ్యక్తికి అనేక ఫోన్ కాల్స్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వాటి సంగతి నిగ్గు తేల్చబోతున్నారు. నవీన్‌ను విచారించిన తర్వాత.. తాడేపల్లి క్యాంపు ఆఫీసులోని సదరు కీలక వ్యక్తికి కూడా నోటీసులు అందుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.
దీనితో పాటు, సీబీఐ అధికారులు పులివెందులలోని ముఖ్యమంత్రి ఓఎస్డీ కార్యాలయానికి వెళ్లి అక్కడి కొంతమంది అధికార్ల పేర్లను ప్రస్తావించి మరీ వారి గురించి వాకబు చేయడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వివేకా హత్య కేసు- సీబీఐ విచారణ పర్వంలో తొలిసారిగా అధికారికంగా సీఎం క్యాంపు ఆఫీసు, సీఎం ఓఎస్డీ ఆఫీసు అనే మాటలు వినవస్తున్నాయి. నెమ్మదిగా కేసు విచారణ సీఎం జగన్ వైపుగా మళ్లుతున్నదా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.
హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి స్వయంగా జగన్‌కు చిన్నాన్న. ఆయన ఖాళీ చేసిన సీటులోంచే జగన్ పోటీచేసి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. జగన్ రాష్ట్ర రాజకీయాల్లోకి పరిమితం అయ్యాక.. కడప ఎంపీ స్థానం తనకే కావాలని వివేకా మళ్లీ పట్టుపట్టారని, తనకు ఇవ్వకపోతే విజయమ్మ, షర్మిలలో ఒకరికి ఇవ్వాలని అన్నారని ప్రచారం ఉంది. అందుచేతనే వివేకా హత్యకు గురయ్యారనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఆ స్థానంలో ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి పాత్ర గురించి కూడా ప్రచారం ఉంది. ఆయనకు వైఎస్ జగన్ ఆశీస్సులు, మద్దతు ఉన్నాయని ప్రతిపక్షాలు చాలా సార్లు ఆరోపిస్తున్నాయి. అయితే అధికారికంగా సీబీఐ విచారణ పర్వంలో సీఎం పాత్ర దిశగా సంకేతాలు కనిపించడం ఇదే ప్రథమం. అందుచేతనే సీబీఐ విచారణ ఆసక్తికరంగా మారుతోంది.
డొంక కదులుతోంది! జగన్‌కు ప్రమాద ఘంటికలా?
Friday, November 15, 2024