జగన్ అనుచర వర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరు మోసిన వ్యక్తి. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు గమనిస్తే.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారో పొగుడుతున్నారో కూడా అర్థం కాదు. అలాంటి డిప్యూటీ సీఎం.. తాజాగా పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడ్డారు. అయితే తమాషా ఏంటంటే.. ఆయన పవన్ కల్యాణ్ మీద సీరియస్ గా విమర్శలే చేశారు గానీ.. వాటిని ఇంకో కోణంలో పరిశీలించినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలాగా.. పవన్ కల్యాణ్ కు ఎడ్వాంటేజీ అయ్యేలాగా కనిపిస్తున్నాయి.
వైసీపీ నాయకులు గూండాలు, రౌడీలు అంటూ పవన్ విమర్శిస్తూ వస్తున్నారు. వారాహి యాత్ర కాదు కదా అంతకంటె ముందుకూడా ప్రతి సభలోనూ ఆయన ఇలాంటి మాటలు అంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ ప్రతి మాటకూ కౌంటర్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా.. నారాయణస్వామి.. పవన్ ఫ్యాన్స్ పై కూడా అలాంటి నిందలే వేశారు. పవన్ సభల్లో ఈలలు వేసే జనం అంతా క్రిమినల్సే అని ఉపముఖ్యమంత్రి పేర్కొనడం విశేషం. ఈలలు వేసే జనం ప్రతి పార్టీకి ఉంటారు. జగన్ చుట్టూ ఈలలు వేసేవారు కూడా ఉంటారు. వారందరూ క్రిమినల్సే అవుతారా? అనేది ప్రజలకు ఎదురవుతున్న ప్రశ్న.
అదేతీరుగా.. పవన్ కల్యాణ్ పార్టీది ఏ గుర్తో ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా నారాయణస్వామి డిమాండ్ చేశారు. నిజానికి ఈ విమర్శకు కొన్ని రోజుల కిందటి వరకు వేలిడిటీ ఉన్నది. అప్పట్లో ప్రతి వైసీపీ నాయకుడు కూడా పవన్ కల్యాణ్ గుర్తు మాయమైపోతుంది.. గుర్తు గండం ఉంది లాంటి మాటలు చెప్పారు. కానీ కొన్ని రోజుల కిందట ఎన్నికల సంఘం పార్టీకి గుర్తులను కేటాయించింది. పవన్ కల్యాణ్ పార్టీకి అదే గ్లాసు గుర్తును అలాగే రిజర్వు చేసింది. ఇప్పుడు పవన్ పార్టీకి గుర్తు ప్రమాదం లేదు. తమ నాయకులు పవన్ ను తిట్టిన, తిట్లను ఫాలో అయిన నారాయణస్వామి ఆ తర్వాత కొన్ని రోజులుగా పేపరు చదివినట్లు లేదు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.
సినిమాల ద్వారా రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకునే పవన్ కల్యాణ్.. తన కాపు సామాజిక వర్గానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని నారాయణ స్వామి విమర్శించడం కూడా విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వమే వారికి ఏమీ చేయడం లేదని పవన్ విమర్శిస్తోంటే,.. దానికి కౌంటర్ గా సొంత డబ్బుతో ఏం చేయలేదనడం ఎంతవరకు సబబు అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తాను రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సొమ్ముతోనే.. జగన్ సర్కారు అరాచకాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలకు తాను స్వయంగా ఆర్థిక సాయం చేస్తున్నాడని.. ప్రభుత్వం విస్మరించిన కౌలురైతుల కన్నీళ్లను పవన్ తాను సొంత ఖర్చుతో తుడుస్తున్నాడని జనసైనికులు విరుచుకుపడుతున్నారు. పాపం డిప్యూటీ సీఎం గారి సరికొత్త విమర్శలు బ్యాక్ ఫైర్ అయినట్లుగా కనిపిస్తోంది.