డాంబికాలు మాని ప్రాక్టికాలిటీలోకి షర్మిల!

Wednesday, January 22, 2025

నిన్నటిదాకా షర్మిల మాటలను గమనించారా..? ‘నేనే కాబోయే ముఖ్యమంత్రిని’ అని ప్రతి సభలోను ఆమె చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు! వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావడం తద్యమని పదేపదే సెలవిచ్చారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఏఏ సరికొత్త సంక్షేమ పథకాలు చేపడతానో.. నిరుద్యోగులకు ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు కల్పిస్తానో అని హామీలు గుప్పించారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ కుటుంబ అవినీతి మీద విచారణ జరిపించి ఏరకంగా వారికి శిక్షలు పడేలా చేస్తానో కూడా ఆమె ఆర్భాటంగా చెప్పారు. అయితే షర్మిల మాటలను గాని, పాదయాత్రను గాని, ప్రచారాలను గాని తెలంగాణలో పట్టించుకున్న రాజకీయ పార్టీ మరొకటి లేదు. కాలక్రమంలో షర్మిల ఆర్భాటపు ప్రకటనలు మాని నెమ్మదిగా వాస్తవంలో పడుతున్నట్లున్నారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతున్న సమయంలో షర్మిల తన మాటల తీరు మార్చినట్లుగా కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని పెద్ద ప్రచారమే మొదలైంది. దీనిని ఖండించడానికి షర్మిల ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించినది కాంగ్రెసులో విలీనం చేయడానికి కానే కాదని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ దఫా ఆమె తాను ముఖ్యమంత్రి కావడం గురించిన కబుర్లు చెప్పలేదు. కాస్త ప్రాక్టికల్ స్పృహలోకి వచ్చినట్లుగా మాట్లాడారు.
ఢిల్లీకి చెందిన ఒక సంస్థ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తమ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 44 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావం చూపగలదని తేల్చినట్లుగా షర్మిల ప్రకటించారు. పోటీ కీలకంగా, క్లిష్టంగా ఉండే నియోజకవర్గాలలో వెయ్యి రెండువేల ఓట్లు కూడా అభ్యర్థుల విజయావకాశాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఈ లెక్కన షర్మిల పార్టీ 44 నియోజకవర్గాలలో ప్రభావం చూపడం అనేది గొప్ప సంగతి ఏమీ కాదు. అయితే ‘ప్రభావం చూపుతాను’ అనే మాట వరకే పరిమితం అవుతున్నారు తప్ప 44 స్థానాలలో గెలవబోతున్నాం లాంటి డాంబికపు ప్రకటనలు చేయడం లేదు గనక ఆమెను అభినందించాల్సిందే. ఇన్ని స్థానాలలో జయాపజయాలను తన పార్టీ నిర్దేశిస్తుంది అనే ప్రచారంతో ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధం కావాలని షర్మిల అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఆమె ఆ సంఖ్య చెప్పినంత మాత్రాన అన్ని సీట్లను ఆమె పార్టీకి కేటాయించడానికి ఏ ఇతర పార్టీ కూడా సిద్ధంగా ఉండదు. కెసిఆర్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ గానే పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటిది షర్మిలకు 44 కాదు కదా 10 సీట్లు ఇవ్వడానికైనా వారు సుముఖంగా ఉంటారా అనేది ప్రశ్నార్థకం. ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలవగలరో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేని స్థితిలో ఉన్న షర్మిల తన మ్యాజిక్ ఫిగర్ 44 విషయంలో ఎంతవరకు రాజీ పడతారో.. ఎన్ని మెట్లు దిగి వస్తారో.. వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles