ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతోంది. చంద్రబాబు సభలో తొక్కిసలాట 8 మంది మరణం తర్వాత, గుంటూరులో జరిగిన కార్యక్రమానికి మరింత పటిష్టంగా ఏర్పాట్లుచ చేయాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. తొక్కిసలాట జరిగితే.. ఇరుకు సందుల్లో సభలు నిర్వహిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన వారు.. గుంటూరులో విశాలమైన చోట మీటింగు పెట్టినా.. సరైన ఏర్పాట్ల గురించి పట్టించుకోలేదు. సహజంగానే జనం వెల్లువలా వచ్చారు. పోలీసులు చేతులెత్తేయడంతో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే.. కందుకూరు దుర్ఘటన ఒక తీరుగా జరగగా, గుంటూరులో కొందరు తొక్కిసలాటను పనిగట్టుకుని ప్రేరేపించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వైకాపా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్లు గుంటూరు ప్రమాదానికి కారకులని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ మాటల్లో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ.. చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న సభలకు సరైన భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలం అవుతున్న మాట నిజం. అసలు ఏర్పాట్ల గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మాట నిజం. అదే సమయంలో చంద్రబాబలు సభలు ఎక్కడ నిర్వహించినా సరే.. జనం వెల్లువలా పోటెత్తి వస్తున్నమాట కూడా నిజం. అందుకే చిన్నా పెద్దా ఊర్లలో ఎక్కడ సభ పెట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. కానీ జనానికి తగిన ఏర్పాట్ల నిర్వహణలో పోలీసులు ఫెయిలవుతున్నారు.
చంద్రబాబు సభల్లో మరిన్ని తొక్కిసలాటలు, మరింత గందరగోళాలు జరగాలనేది అధికార పార్టీ కోరిక కూడా అయి ఉండొచ్చు. భ్రదత విషయంలో వారి నిర్లక్ష్యానికి ఇంతకు మించి మరో రకంగా అర్థం చెప్పుకోలేం. ఇలాంటి నేపథ్యంలో.. ఇకమీదట జరిగే చంద్రబాబునాయుడు సభలకు తెలుగుదేశం పార్టీ స్వయంగా కొంత మేర భద్రత ఏర్పాట్లు చూసుకోవడానికి, నిర్వహణను పర్యవేక్షించడానికి సొంత దళాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.టీడీపీ వాలంటీర్లు అవసరాన్ని బట్టి వందల సంఖ్యలో కార్యక్రమా నిర్వహణ సజావుగా జరిగేందుకు పాలు పంచుకుంటారని తెలుస్తోంది. ప్రభుత్వం భద్రతను పట్టించుకోకపోవడం మాత్రమే కాకుండా, దుర్ఘటనలు జరగాలని కోరుకుంటున్నదని భావిస్తున్న నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ ముందుజాగ్రత్తలు తీసుకుంటోంది. తమకున్న ప్రజాదరణను కాపాడుకోవడంతో పాటు, వారికి ఎలాంటి ప్రమాదం నష్టం జరగకుండా చూసేందుకు సొంతంగా వాలంటీర్ల మీద ఎక్కువగా ఆధారపడాలని పార్టీ అనుకుంటున్నట్టు సమాచారం.
టీడీపీ సభల భద్రతకు సొంత వలంటీర్లు!
Friday, November 15, 2024