తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి పగ్గాలు చేపట్టడానికి రెడ్లకు మినహా మరొక కులం వారికి అర్హత ఉండదా? ‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగినంత కాలం రెడ్లు మాత్రమే టీటీడీ చైర్మన్ గా ఉండగలరు’ అని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వదలుచుకుందా? రెండు దఫాలు చైర్మన్‌గిరీని వెలగబెట్టిన జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ముగిసిపోతుండడంతో, ఆ స్థానంలో తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని నియమిస్తూ జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తమ పాలనలో కీలక పదవులు రెడ్డి వర్గానికి మాత్రమే అని వారు నమ్మితే నమ్మవచ్చు గాక, కానీ బీసీలకు పదవి ఇస్తాం అని చివరి నిమిషం వరకు ఊరించి ఆశ చూపించి వంచించడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. జగన్ పరిపాలన ప్రారంభం అయిన తరువాత అప్పటికే రాజకీయంగా ఎలాంటి పదవులు లేకుండా ఖాళీగా ఉన్న బాబాయి వైవి సుబ్బారెడ్డి కి నామినేటెడ్ పోస్టుల్లో రాష్ట్రంలోనే అత్యున్నతమైనదిగా భావించే టిటిడి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మరో రెండేళ్ల పాటు ఆయననే కొనసాగించారు. అయితే ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాలలో మరింత చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటుండడం వలన హ్యాట్రిక్ అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి మరింత యాక్టివ్ గా రాజకీయాలు చేయదలచుకుంటున్నారు కనుక పదవీకాలం ముగియగానే కొత్త వారి కోసం పార్టీ అన్వేషించింది. ఈ క్రమంలో ‘రెండు సార్లు రెడ్డి వర్గానికి ఇచ్చాము కనుక, ఈసారి బీసీలకు పదవి కేటాయిస్తాం’ అని ప్రభుత్వం సంకేతాలు పంపింది. రాబోయేది ఎన్నికల సంవత్సరం గనుక, బీసీలకు కీలకమైన టిటిడి పదవి కట్టబెడితే రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గాలలో ప్రభావం ఉంటుందని, ఆ మేరకు తాము సామాజిక న్యాయం పాటిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందవచ్చునని వారు అనుకున్నారు. సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి పేరు ప్రముఖంగా తెరమీదకు వచ్చింది. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ టీటీడీ చైర్మన్ పదవిని తిరిగి రెడ్డి వర్గానికి కట్టబెట్టారు.
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యే గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా తాడేపల్లి వెళ్లి జగన్ ను కలిసి తనకు టీటీడీ పదవి కావాలంటూ ఒప్పించగలిగారు. నియోజకవర్గంలో తన పట్ల ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వచ్చే ఏడాది ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారసుడుగా కొడుకు అభినయ రెడ్డిని రంగంలోకి దించాలి అనుకుంటున్న భూమన తాను సేఫ్ జోన్ లోకి వెళుతూ టీటీడీ పదవిని పుచ్చుకోవడం గమనార్హం.