టీటీడీ పదవి : మళ్లీ బాబాయికేనా? బీసీలకు ఇస్తారా?

Wednesday, January 22, 2025

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి పదవీకాలం ముగియనుంది. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్ గా రెండేళ్లుగా విధుల్లో ఉన్న పాలకమండలి ఆగస్టు 8వ తేదీనాటికి రద్దవుతుంది. తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత.. జగన్మోహన్ రెడ్డి వరుసగా రెండు దఫాలు బాబాయి వైవీ సుబ్బారెడ్డినే టిటిడి ఛైర్మన్ పదవిలో కూర్చుండబెట్టారు. అయితే సీఎం జగన్, బాబాయికి ముచ్చటగా మూడోసారి కూడా ఛైర్మన్ పదవిని కట్టబెడతారా? లేదా, ఇది ఎన్నికల సంవత్సరం గనుక.. వ్యూహాత్మకంగా బీసీలకు ఎవరికైనా ఛైర్మన్ స్థానం అప్పగిస్తారా? అనే చర్చ పార్టీలో నడుస్తోంది.

వైవీ సుబ్బారెడ్డి 2021 ఆగస్టులో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు ఖాళీ ఉండకుండా.. ముందు బాబాయిని ఛైర్మన్ గా నియమించేసిన జగన్, ఆ తర్వాత నెలరోజుల మల్లగుల్లాల తర్వాత బోర్డు సభ్యులను నియమించారు. వారంతా సెప్టెంబరులో ప్రమాణాలుచేశారు. అయితే దేవాదాయశాఖ చట్టం ప్రకారం.. ఛైర్మన్ ప్రమాణం చేసిన నాటినుంచి వారి పదవీకాలం కూడా లెక్కలోకి వస్తుంది. దీంతో ఆగస్టు 8వ తేదీన మొత్తం బోర్డు పదవీకాలం ముగుస్తుంది.

అయితే కొత్తగా టీటీడీ సారథ్యాన్ని బీసీల చేతికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ కులాల వారిని ఎంపిక చేయాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో ఓసారి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర నుంచి జగన్ కనీసం ఒక్కరికైనా టీటీడీ బోర్డు సభ్యుడిగా అయినా అవకాశం ఇచ్చారా? అంటూ నిలదీశారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి ఉత్తరాంధ్ర బీసీలకు ఇస్తే పార్టీకి లాభసాటిగా ఉంటుందనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకోసం కొన్ని నెలల కిందటే వైవీసుబ్బారెడ్డితో రాజీనామా చేయించాలని కూడా జగన్ అనుకున్నారు. అయితే దేవాదాయ శాఖ చట్టం ప్రకారం చైర్మన్ రాజీనామా చేసినా బోర్డు మొత్తం రద్దవుతుంది. అసలే వైవీ సుబ్బారెడ్డి అప్పటికే రెండోసారి పదవి అనుభవిస్తున్నారు. బోర్డు సభ్యులకు పదవీకాలం పరంగా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వైవీతో రాజీనామా చేయించకుండా ఆగారు. ఇప్పుడు మూడోసారి ఆయనకు పదవి కొనసాగించే  అవకాశం మాత్రం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వైవీ కూడా ఎన్నికల రాజకీయాల్లోకి రావాలని, క్రియాశీలంగా మారాలని అనుకుంటున్నారు. దీనికి తగినట్టుగా టీటీడీ బాధ్యతలనుంచి తప్పుకోవాలనే అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రద్దు కానున్న బోర్డులో కేవలం ఏడుగురు మాత్రమే ఏపీకి చెందిన సభ్యులుండగా.. ఆగస్టు లో ఏర్పాటు కాబోయే కొత్త బోర్డులో గరిష్టంగా ఏపీ వారికే అవకాశాలు దక్కుతాయని.. తద్వారా రాజకీయంగా ప్రయోజనం ఉండేలా చూసుకుంటున్నారని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles