టార్గెట్ పవన్ : అనుమతులు మధ్యలో రద్దవుతాయా?

Saturday, September 7, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో తన వారాహి యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇది ఎన్నికల యాత్ర కాదని అంటున్న జనసేన, ప్రజా సమస్యలపై పోరాటాలకు రూపకల్పన చేసే విధంగా.. చాలా పక్కాగా పవన్ కల్యాణ్ యాత్రను ప్లాన్ చేశారు. ప్రాథమికంగా ఉభయగోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర జరిగేలా తొలివిడత రూట్ మ్యాప్ సిద్ధమైంది. ప్రతినియోజకవర్గంలోనూ పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు బస చేస్తారు. అక్కడి ప్రజలు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారితో సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు, వీరమహిళలతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బహిరంగసభను కూడా నిర్వహిస్తారు.
ఈ ప్లాన్ పరంగా చాలా బలంగానే కనిపిస్తోంది. కానీ ఆచరణలో వచ్చేసరికి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పూర్తి అవుతుందా లేదా అనే సందేహం పలువురికి కలుగుతోంది.
ఎందుకంటే, చంద్రబాబునాయుడుకంటె ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తుంటుంది. పవన్ తన టూర్ ప్లాన్ ను సమర్పించినప్పుడు పోలీసులు ఖచ్చితంగా కొన్ని నిబంధనలు విధించి మాత్రమే అనుమతి ఇస్తారనేది ఊహించవచ్చు. అయితే పోలీసులు విధించగల నిబంధనలను ఉన్నదున్నట్టుగా పాటించడం అనేది పవన్ కల్యాణ్ దళానికి అసాధ్యం.
ఎందుకంటే పవన్ కల్యాణ్ ఒకసారి రోడ్డుమీదకు వచ్చిన తర్వాత.. ఆయన వెంట జనం వెల్లువ ఖచ్చితంగా ఉంటుంది. పవన్ వారాహి రోడ్డుమీద సాగుతున్నప్పుడు.. దాని వెనుక వందల వేల సంఖ్యలో కార్లు, మోటారు సైకిళ్లు ప్రవాహంలా వచ్చే అవకాశం ఉంటుంది. వారిని కంట్రోల్ చేయడం అంత చిన్న సంగతి కాదు. అంటు పార్టీ నాయకులు గానీ, ఇటు పోలీసులు గానీ కంట్రోల్ చేయలేరు. ఒకటిరెండు అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. నిబంధనలు అతిక్రమించారనే సాకు చూపించి.. పవన్ కల్యాణ్ యాత్రకు మధ్యలోనే అనుమతులు రద్దుచేసే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. అందుకే జనసేన నాయకులు కూడా తమ కార్యకర్తలను పవన్ అభిమానులను నియంత్రణలో ఉండాల్సిందిగా సభలు, ర్యాలీల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఇప్పటినుంచే సూచనలు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ 11 నియోజకవర్గాల యాత్ర అంటే.. లెక్కకు 22 రోజులు అయినప్పటికీ.. యాత్ర సుమారు నెలపాటు సాగే అవకాశం ఉంది. పూర్తికాలం యాత్రను సాగనిస్తారా.. లేదా నిబంధనల పేరు చెప్పి మధ్యలోనే యాత్రకు పవన్ విరామం ప్రకటించేలా పోలీసులు దూకుడు ప్రదర్శిస్తారా? అనేది వేచిచూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles