టార్గెట్ చేసేకొద్దీ కోటంరెడ్డి రెచ్చిపోతున్నారు!

Thursday, December 19, 2024

 తమకు అనుకూలంగా ఉన్నంతకాలం సానుకూలంగానే వ్యవహరిస్తూ.. తమతో విభేదించి, ధిక్కరించి, వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తే అంతు చూసేలా టార్గెట్ చేయడం రాజకీయాలలో కొత్త విషయం ఎంత మాత్రం కాదు.  కానీ,  వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మూడు తరాలుగా తాను సేవ చేస్తూనే ఉన్నానని,  అయినా తనను వేధిస్తున్నారని చెప్పుకుని పార్టీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మరింతగా ఇబ్బంది పెట్టడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసు కేసులలో ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా విమర్శలు వస్తున్నాయి.  తమాషా ఏమిటంటే కోటంరెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న కొద్దీ.. ఆయన మరింతగా రెచ్చిపోతూ ఉన్నారు.  అధికారంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద,  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద నిశిత విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

 ప్రతిపక్ష పార్టీలు- సకల శాఖల మంత్రిగా పిలుచుకునే సజ్జల రామకృష్ణారెడ్డికి  ప్రభుత్వంలో అనల్పమైన ప్రాధాన్యం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.  మంత్రులు కూడా ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారని అంటుంటారు.   పోలీసు శాఖను మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి తెరవెనుక నుంచి నడిపిస్తుంటారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటాయి.  అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి తనను వేధించడానికి దొంగ కేసులు పెట్టిస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. . తన నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని వేరు చేయడానికి కుట్రలు చేస్తున్నారని కూడా అంటున్నారు.

నిజానికి శ్రీధర్ రెడ్డి నుంచి తమ్ముడు గిరిధర్ రెడ్డి  చీలిపోతారనే ప్రచారం తొలి రోజుల్లోనే జరిగింది.  నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తమ్ముడిని పోటీ చేయించినట్లయితే గనుక తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కుటుంబంలో తగాదాలు ఉండడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించిన శ్రీధర్ రెడ్డి అప్పట్లో సంచలనం సృష్టించారు.  ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ కలిసే కనిపించారు.  ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ రెడ్డి తన నుంచి తమ్ముడిని వేరు చేయడం మీకు సాధ్యం కాదు అని అధికార పార్టీని హెచ్చరిస్తున్నారు. 

శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది ఇంకా జరగనే లేదు.  నిజానికి ఆ పార్టీలో కొందరు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా ఒక ప్రచారం ఉంది.  అదే నిజమైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడుతుంది. . అయినా సరే ఈ పరిణామాలు వేటిని ఆయన ఖాతరు చేస్తున్నట్లు లేదు.  తనను ఇబ్బంది పెట్టడానికి అధికారపక్షం ఒక చిన్న ప్రయత్నం చేస్తే,  అందుకు పదిరెట్లు ఆగ్రహంతో ఆయన ప్రతిస్పందిస్తున్నారు.  వారిని బజారుకు లాగుతున్నారు.  జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు..  అప్పట్లో అధికార పార్టీని వదిలి ఆయన వెంట నడిచిన తన అనుచరులను కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   కోటంరెడ్డి వ్యవహారాన్ని..  ఇక్కడితో వదిలి పెట్టకుండా,  ఆయనను మరింత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించే కొద్దీ పాలక పక్షానికి కూడా నష్టమే అనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles