‘జయ’ రాక ‘విజయ’కు చెక్ అవుతుందా?

Wednesday, January 22, 2025

వెటరన్ సినీ హీరోయిన్ జయసుధ భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఉన్నపళంగా జరిగిన నిర్ణయం కాదుట. సుమారు ఏడాదినుంచి ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడానికి చర్చలు జరుగుతున్నాయట. కానీ, రాష్ట్ర భాజపా నాయకులు ఆమెను దగ్గరకు రానిచ్చినట్టు లేదు. మొత్తానికి రాష్ట్ర పార్టీ సారథ్యం మారి కిషన్ రెడ్డి అధ్యక్షుడు కాగానే.. జయసుధ కల ఫలించింది. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.  తాను క్రైస్తవ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. క్రైస్తవులకు మేలు చేయడానికి, పేదలకు అండగా ఉండడానికి బిజెపిలో ఉండి పనిచేస్తానని ఆమె ప్రకటించారు. ఇన్నేళ్లుగా ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిజెపిలో చేరుతున్న్టట్టు కూడా ఆమె తెలిపారు.

అయితే తెలంగాణ కమలదళంలోకి ‘జయ’ రాక అనేది.. ‘విజయ’ పోకకు దారితీస్తుందా? అనే వాదన ఒకటి వినిపిస్తోంది. ఒకరి రాక మరొకరి పోక ఏకకాలంలో జరుగుతాయా అనే అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతోంది. నిజానికి జయసుధకు, విజయశాంతికి మధ్య ఎలాంటి వైరం లేకపోయినప్పటికీ.. విజయశాంతి పార్టీ పట్ల వెల్లడిచేస్తున్న అసంతృప్తి, తిరుగుబాటు ధోరణి గమనించిన వారికి ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి.

కిషన్ రెడ్డి రాష్ట్ర భాజపా సారథ్యం స్వీకరించిన తర్వాత.. కారణాలు బహిర్గతం కాకపోయినప్పటికీ విజయశాంతి తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. ఆయన పదవీ స్వీకార సభలో ఆమె ఆయనకు జస్ట్ శాలువా కప్పేసి.. అక్కడినుంచి వెళ్లిపోయారు. చిలవలు పలవలుగా పుకార్లు పుట్టడంతో.. ఆమె చిన్న వివరణ ఇచ్చారు. ఆ సందర్భానికి ఏదో కంటితుడుపుగా.. కారణాన్ని కిరణ్ కుమార్ రెడ్డి మీదకు నెట్టేశారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిలాంటి నాయకులు ఉన్న వేదిక మీద ఉండడానికి తనకు మనస్కరించలేదని ఆమె అన్నారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వేదిక మీద ఉండడానికే ఇష్టపడని విజయశాంతి, ఆయనకు పెద్దపీట వేస్తున్న పార్టీలో మాత్రం ఎలా ఉండగలరు? అనేది కీలక ప్రశ్న.  కిషన్ రెడ్డి నాయకత్వం మీద కూడా ఆమెకు అసంతృప్తి ఉన్నట్టుగా పుకార్లున్నాయి.

ఇలాంటి సమయంలోనే కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జయసుధను పార్టీలోకి తీసుకువచ్చారు. ఆల్రెడీ బిజెపిలో మరో మాజీ హీరోయిన్ జీవిత కూడా ఉన్నారు. అతి తరచుగా అన్ని పార్టీల్లోనూ చేరుతూ, బయటకు వస్తూ ఉండే జీవిత రాజశేఖర్ దంపతులు ప్రస్తుతానికి తెలంగాణ బిజెపిలో ఉన్నారు. పార్టీ ఆదేశిస్తే ఏ నియోజకవర్గంనుంచి అయినా పోటీచేయడానికి సిద్ధం అని జీవిత ఆల్రెడీ ప్రకటించారు కూడా. ఇలాంటి నేపథ్యంలో.. సినిమా గ్లామర్ కోసం బిజెపి విజయశాంతి మీద మాత్రమే ఆధారపడే పరిస్థితిలేదు. నిజానికి ఆమె సహా అందరూ వెటరన్ హీరోయిన్లే. ఆమెకు అగ్రపూజ దక్కడం కష్టం. అసలే అసంతృప్తి.. దానికి తోడు ప్రయారిటీ దక్కకపోతే.. విజయశాంతి వేరే దారి చూసుకుంటారా అనే పుకార్లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles