ఎన్నికలు దగ్గర పడుతూ ఉండే కొద్దీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్రవిచిత్రమైన ఐడియాలు వస్తున్నట్టున్నాయి. కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేయాలని, కొత్త కొత్త పేర్లతో తన పేరును చిరస్థాయిగా నిలిపేసుకోవాలని ఆయన ముచ్చటపడుతున్నట్లున్నారు. ప్రజలు తమ సమస్యల గురించి అధికార్లకు విన్నపాలు సమర్పించుకునే అతి సాధారణమైన స్పందన కార్యక్రమానికి.. ఇప్పుడు జగన్ ఒక అందమైన ముసుగు తొడుగుతున్నారు. ‘జగనన్నకు చెబుదాం’ అని పేరు పెట్టి.. ఆ కార్యక్రమం కింద.. కొత్త ప్రహసనం నడిపించనున్నారు.
‘జగనన్నకు చెబుతాం’ అనేది ఒక రకంగా బెదిరింపు లాగా కూడా ధ్వనిస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ప్రజలు నిత్యం శాఖల వారీగా స్పందన కార్యక్రమాల్లో సమర్పించుకునే వినతుల గొడవే ఇదంతా. అంతా కలిపి మానిటరింగ్ కు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారన్నమాట. స్పందనలో అధికారులు చెవిన వేసుకోని వారి గోడు.. ఎప్పటికీ అలాగే ఉండిపోతోంది.
జగనన్నకి చెబుదాం అనేది ఏదో నామ్ కే వాస్తే అలా ఉన్నది తప్ప.. నిజంగా జనం జగన్ కు చెప్పేదేమీ ఉండదు. ఆయన స్వయంగా వినేది కూడా ఉండదు. కానీ.. తాము సమర్పించుకునే ప్రతి వినతిపత్రానికి జగనన్నకు చెబుదాం అంటూ ఆయన పేరుతో ఓ రసీదు.. ఓ ఫాలో అప్ మాత్రం ఏర్పడతాయి.
జగనన్నకు చెబుదాం అనే టైటిల్ ప్రజల్లో ఎలాంటి స్పందన రాబడుతుందో.. అది ప్రారంభం అయిన తర్వాత గానీ తెలియదు. కానీ ముఖ్యమంత్రి జగన్ దీని గురించి ప్రకటించిన నాటినుంచి.. పార్టీలో మాత్రం రకరకాల జోకులు పేలుతున్నాయి. జగనన్నకు వినిపించేలా గోడు చెప్పుకోవడం అనేది.. పార్టీలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆచరణ సాధ్యం కాని వ్యవహారం అని, అలాంటిది- సామాన్యులు చెప్పుకోడానికి చాన్స్ ఉంటుందా అని నవ్వుకుంటున్నారు.
ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కానేలేదు. ఈ పేరు ద్వారా స్పందన కార్యక్రమానికి కొత్త రూపు ఇస్తున్నారు. ఇది కేవలం.. జనాన్ని మభ్యపెట్టే క్రమంలో మరో ప్రయత్నం మాత్రమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే అధికారులు, కలెక్టర్లు నిర్వహించే స్పందన పట్ల జనంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అత్యంత సింపుల్ సమస్యలను తీర్చేస్తూ, చాలా వాటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ ఫిర్యాదులకు, జనం వినతులకు ఇప్పుడు ‘జగనన్నకు చెబుదాం’ అని కొత్త పేరు పెడితే.. అలాంటి అసంతృప్త స్వరాలు, నిందలు జగన్ పేరుతో ముడిపడి వ్యక్తమవుతూ ఉంటాయి.. ఆ సంగతి జగన్ తెలుసుకోవాలి.
జనాన్ని మభ్యపెట్టే డ్రామా కాదా ఇది!
Tuesday, December 24, 2024