భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల ఇప్పుడు జనసేన నాయకులు గుస్సా అవుతున్నారు. జనసేన నుంచి ఒక కీలక నాయకుడు పార్టీని వీడిపోతే.. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా.. సోము వీర్రాజు తప్పు చేశాడని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు రెండు పార్టీల మధ్య అసలే అంతంతమాత్రంగా మారుతున్న సంబంధాలను దెబ్బతీస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సందర్భమే ఎదురైనప్పుడు.. జనసేన పార్టీ పొత్తు ధర్మాన్ని గౌరవించి నైతిక విలువలను పాటించిందని, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాత్రం.. ఎలాంటి నైతికత లేకుండా తమ పార్టీకి ద్రోహం చేసే, అసమంజసమైన నిర్ణయం తీసుకున్నదని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీకి విజయవాడ కేంద్రంగా ఉన్న కీలక నాయకుల్లో ఆకుల కిరణ్ కుమార్ ఒకరు. జనసేన పార్టీ తరఫున చాలా తరచుగా టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని చాలా గట్టిగానే వినిపిస్తుంటారు. అలాంటి ఆకుల కిరణ్ కుమార్ తాజాగా ఉగాది నాడు జనసేనను వీడి, బిజెపి తీర్థం పుచ్చకున్నారు. ప్రస్తుతం పరిణామాల్లో జనసేన ఒక వైపు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి ఉత్సాహపడుతుండగా, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకూడా ప్రజల్లో పెరుగుతున్న మద్దతుతో అంతో ఇంతో బలపడుతుండగా.. ఆ పార్టీ కీల నాయకుడు, ఆ పార్టీలో ఇన్నాళ్లు పనిచేసినందుకు భవిష్యత్తు కూడా ఉన్న నాయకుడు ఆకుల – వీరిని కాదనుకుని బిజెపి వైపు వెళ్లడం ఒక ఆశ్చర్యకరమైన పరిణామం.
ఈయన ఫిరాయింపు అనేది ఒక పార్శ్వమైతే.. పొత్తుబంధంలో ఉన్న తమ పార్టీకి చేటు చేసేలా.. ఇలాంటి ఫిరాయింపు చేరికను ప్రోత్సహించడం భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన నైతిక విలువ అవుతుందని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీ మీద అయిష్టంతో వేగిపోతున్నప్పుడు.. ముందుగా జనసేనలో చేరడానికే ప్రయత్నించారనేది వారి వాదన. ఆయన జనసేనలో చేరడానికి సిద్ధపడి, నాదెండ్ల మనోహర్ తో మంతనాలు కూడా జరిపారని, అయితే బిజెపితో పొత్తుల్లో ఉంటూ వారి నాయకుడిని తమలో కలిపేసుకుంటే నైతికంగా విలువలు పాటించినట్లు కాదు అనే ఉద్దేశంతో జనసేనాని మిన్నకుండిపోయారని జనసేన నాయకులు అంటున్నారు. ఇలా పొత్తు ధర్మాన్ని గౌరవించి, నైతిక విలువలతో జనసేన కన్నాను చేర్చుకోలేదని, అదే సమయంలో, బిజెపి మాత్రం.. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి తమ పార్టీ నేతలను వారి పార్టీల కలిపేసుకుంటున్నదని అంటున్నారు.
మొత్తానికి బందరులో పవన్ కల్యాణ్ ప్రసంగం, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ జనసేన తీరుపై వెళ్లగక్కిన ఆగ్రహావేశాల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు పుటుక్కుమంటుందా అన్నట్టుగా తయారైన జనసేన–బిజెపి బంధం.. ఆకుల కిరణ్ కుమార్ ఫిరాయింపుతో మరొక స్టెప్ దెబ్బతిన్నట్లే అయిందనే ఆరోపణలు జనసేన వైపు నుంచి వినిపిస్తున్నాయి.