జనసేనానిని దైవదర్శనానికి కూడా రానివ్వరా?

Sunday, January 19, 2025

జనసేనాని పవన్ కల్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏ స్థాయిలో కక్ష కట్టిందో గమనిస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన బుధవారం నుంచి ప్రజల్లోకి వెళ్లడానికి వారాహి యాత్రకు సిద్ధమయ్యారు. యాత్రకు సంబంధించి, అనుమతులకోసం చాలా ముందుగానే పోలీసు అధికార్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటిదాకా పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుండడం ఒక సంగతి. ఇదిలా ఉండగా.. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వారాహి యాత్ర ప్రారంభించాలనేది పవన్ కల్యాణ్ ప్రణాళిక కాగా.. అసలు దైవదర్శనానికి కూడా పవన్ ను అనుమనతిస్తారా లేదా?అనే సందేహాలు ఇప్పుడు పుడుతున్నాయి.
షెడ్యూలు ప్రకారం అయితే ఆయన మంగళగిరిలో చేయిస్తున్న యాగం పూర్ణాహుతి ముగిసిన తర్వాత.. పవన్ బయల్దేరి అన్నవరం చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం అన్నవరం ఆలయంలో దర్శనం అనంతరం వారాహి యాత్ర మొదలవుతుంది.
అయితే అన్నవరంలో పవన్ కల్యాణ్ దైవదర్శనమే ఇప్పుడు సస్పెన్స్ లో పడింది. పవన్ కల్యాణ్ దర్శనం గురించి తమకు ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆలయ ఈవో ఆజాద్ అంటున్నారు. అంటే ఆయనకు ప్రోటోకాల్ స్పెషల్ దర్శనం ఉండబోదని అర్థమవుతోంది. అంతవరకు అయితే పరవాలేదు. ఆలయంలో విక్రయించే సాధారణ వీఐపీ టికెట్ తీసుకుని అయినా పవన్ దర్శనానికి వెళ్లగలరు. కానీ ఇతరత్రా ఆయన అన్నవరం పర్యటనలో చికాకులు సృష్టిస్తారేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ అన్నవరం వస్తే.. ఆయన వెంట భారీగా అభిమానులు వెల్లువలా వస్తారని, అన్నవరం ఆలయానికి వచ్చే సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని, కాబట్టి ఆలయం వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీని కోరుతూ ఆలయ ఈఓ ఆజాద్ లేఖ రాయడం కూడా సంచలనం సృష్టిస్తోంది.
పవన్ కల్యాణ్ వెళుతున్నారంటే ఖచ్చితంగా వేల సంఖ్యలో ఆయన అభిమానులు కూడా ఉంటారు. వారి విషయంలో పోలీసులు ఏమైనా అనుచితంగా ప్రవర్తించడం, నిబంధనలు విధించి ఇబ్బంది పెట్టడం జరగవచ్చునని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సంబందించి కూడా ఇప్పటిదాకా అనుమతులు రాలేదు. పార్టీ పిటిషన్ ఇవాళ కోర్టు ఎదుట విచారణకు వస్తుంది. అనుమతులు వచ్చినా రాకపోయినా.. యాత్ర యథావిధిగా కొనసాగించి తీరుతామని.. జనసేన నాయకులు తమ ధిక్కారస్వరాన్ని ఆల్రెడీ ప్రకటించారు. యాత్రే పెద్ద గందరగోళంగా మారుతుందేమోననే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. దానికి తోడు ఇప్పుడు అన్నవరం ఆలయ ఈవో స్పందిస్తున్న తీరు చూస్తే పవన్ కల్యాణ్ దర్శనం కూడా రచ్చరచ్చ అవుతుందేమో అని అనుకుంటున్నారు. ప్రభుత్వం పవన్ పట్ల మరీ కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నదని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles