జనసేనానితో కొత్త బంధాలు ముడిపడుతున్నాయా?

Monday, December 23, 2024

జనసేనాని పవన్ కల్యాణ్ మరింతగా యాక్టివేట్ అవుతున్నారా?పార్టీలోకి ఇతర పార్టీ నాయకుల చేరికలు వంటి సమీకరణలతో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నారా? ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దగ్గర్లోనే.. పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్త యాత్ర ప్రారంభించే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోకి కొత్త నాయకులను ఆహ్వానించే ప్రక్రియ మొదలైందా? అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది. 

తాజాగా జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గుంటూరులోని కన్నా ఇంట్లోనే వీరి సమావేశం జరిగింది. నిజానికి జనసేన- బిజెపి పార్టీలు రెండూ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు. రెండూ మిత్రపక్షాలు, పొత్తుల్లో ఉన్న పార్టీలు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నాయకులు భేటీ కావడం అనేది పెద్ద వార్త కానే కాదు. ఇటీవలి కాలంలో కన్నా లక్ష్మీనారాయణ బిజెపి మీద ధిక్కారస్వరం వినిపించకుండా ఉండి ఉంటే, పవన్ కల్యాణ్ బిజెపితో బంధం కొనసాగడం అనుమానాస్పదంగా మారకుండా ఉంటే.. ఈ భేటీకి పెద్ద ప్రయారిటీ లేదు. అలాంటి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి గనుకనే.. ఈ భేటీ చర్చనీయాంశం అవుతోంది. కన్నా లక్ష్మీనారాయణ బిజెపిని వీడి జనసేనలో చేరుతారనే పుకారు ఒకటి వినిపిస్తోంది. సాధారణంగా జనసేన నాయకులు రాష్ట్ర బిజెపి నాయకులతో భేటీ కావడం చాలా చాలా అరుదు. కన్నా ఇంటికి వెళ్లారు గనుక.. సమీకరణాలు మారుతాయనే చర్చ నడుస్తోంది. 

కన్నా కమలాన్ని వీడి జనసేనలోకి వస్తే గనుక.. ఖచ్చితంగా అది పార్టీకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బిజెపితో పొత్తుల్లో ఉండడం వలన.. రాష్ట్రవ్యాప్తంగా ఎంత లాభం ఉండగలదని జనసేన ఆశిస్తుందో.. అంతకంటె ఎక్కువ లాభం కన్నా ద్వారా ఉండగలదనే విశ్లేషణ కొందరిలో వినిపిస్తోంది. పైగా కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేత, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా సారథ్యం కూడా వహించిన వ్యక్తి ఆ పార్టీని వీడి ఇటు వచ్చేశాడంటే.. ఆ ప్రభావం పార్టీ మీద చాలానే ఉంటుంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఏంటే.. రాష్ట్రంలో రాజకీయమే తమకు ప్రధానం అని అనుకునే అనేకమంది కమల నాయకులు.. నెమ్మదిగా జనసేనలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. నిజానికి మరికొందరు బిజెపి కీలక నాయకులు కూడా.. జనసేనానితో టచ్ లోనే ఉన్నారని కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బిజెపితో బంధం తెగిపోతే పోవచ్చు గాక.. రాష్ట్రంలో జగన్ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలిపోకూడదు.. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదు అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో సాగుతున్న పవన్ కల్యాణ్.. తన పార్టీని బలోపేతం చేసుకోవడం మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి చేరికలు, సమీకరణాల్లో మార్పులు ముందు ముందు ఇంకా ఉంటాయని కూడా తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles