జగన్ అంటే.. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యమేమీ కాదు. ఆయన స్వరం వినపడగానే.. విన్నవారు మాయలో పడి, మోహంలో పడి సర్వం మైమరచిపోవడానికి! ఆయన స్వరంలో మాయ, మహత్తు లేకపోవచ్చు గానీ.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అంతటి వాడు స్వయంగా మాట్లాడితే బహుశా కొందరు ‘ఫ్లాట్’ అయిపోతారు. ముఖ్యమంత్రి తమతో మాట్లాడాడు కదా అనే దిగ్భ్రమకు గురవుతారు. కానీ.. టెక్నాలజీ మారుతున్న రోజుల్లో , టెక్నాలజీ పుణ్యమాని సామాన్య ప్రజల స్పందనలు కూడా మారిపోతున్న రోజుల్లో.. రికార్డెడ్ వాయిస్ సిస్టమ్ ద్వారా… జగన్ గొంతును వినిపిస్తే ప్రజలు ఆశ్చర్యపోయి, సంబరపడిపోయి పండగచేసుకునే అవకాశం ఉంటుందా? అలాంటి భ్రమల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా కొట్టుమిట్టాడుతున్నదో అర్థం కావడం లేదు.
జగనన్నే మా నమ్మకం అంటూ ఇంటింటికీ వాలంటీర్లను తిప్పి పార్టీకోస సర్వే నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఈ ప్రక్రియలో భాగంగా.. వైసీపీకి మద్దతు ఇవ్వదలచుకున్న వారినుంచి ఒక మిస్డ్ కాల్ ఇప్పిస్తుంది. ఆ వెంటనే ఆ కాల్ చేసిన మొబైల్ కు పార్టీనుంచి ఒక కాల్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి స్వరం వారికి స్వయంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
ఇలా.. జగన్ స్వరంతో థాంక్స్ చెప్పించగానే.. ఇవతల దానిని విన్నవారు మురిసిపోతారని పార్టీ అనుకున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ వ్యూహాలు ఇక్కడితో ఆగడం లేదు. ‘జగనన్నకు చెబుతాం’ అనే పేరుతో జగన్ ఇంకో కొత్త కార్యక్రమానికి కూడా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కింద స్వయంగా తన ఫోను నెంబరుకు ఫోనుచేసి ప్రజలు తమ తమ సమస్యలు చెప్పవచ్చునని జగన్ ప్రకటించారు. స్వయంగా తన నెంబరు అంటే.. ప్రత్యేకంగా ఇందుకోసం ఒక నెంబరు కేటాయిస్తున్నారన్నమాట. ఆ నెంబరుకు కాల్ చేస్తే.. అవతలినుంచి జగన్ స్వరం వినిపిస్తుంది. స్వయంగా జగన్ మాట్లాడుతున్నట్టుగా ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వాయిస్ ఇంటరాక్టివ్ కాల్ లో సమస్యలు రిజిస్టర్ చేయడం ఎలాగో అదే పద్ధతిలో జరుగుతుంది. కాకపోతే అవతలి వైపు నుంచి జగన్ స్వరం వినవస్తుంటుంది.
కొన్నేళ్ల కిందటైతే ఇలాంటి గిమ్మిక్కులకు జనం పడిపోయేవారేమో. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ మీద ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతోంది. జగన్ స్వరాన్ని రికార్డెడ్ వాయిస్ అనే సంగతి.. సెకను కంటె తక్కువ వ్యవధిలో 99 శాతం మంది జనం గుర్తుపట్టేస్తారు. ఇదొక గిమ్మిక్ అని వెంటనే అనుకుంటారు. జగన్ ప్రాక్టికల్ గా ప్రజలకు మంచి పాలన అందించే ప్రయత్నం వైపు కాకుండా, ఇలాంటి గిమ్మిక్కుల వైపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ స్వరం వింటే మాయామోహితులు అయిపోతారా?
Wednesday, January 22, 2025