సాధారణంగా ఏకస్వామ్య వ్యవస్థగా నడిచే ప్రాంతీయ పార్టీల్లో నియోజకవర్గస్థాయిలో ముఠాలు ఉండడాన్ని నాయకులు ఇష్టపడరు. అవి పార్టీని నష్టపరుస్తాయని భావిస్తారు. అందరూ తమ చెప్పు చేతల్లో ఒక్క మాట మీదనే ఉండాలని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తీరే వేరు. ఒక నియోజకవర్గంలో ముఠాలు ఏర్పడడానికి, వర్ధిల్లడానికి ఆయన స్వయంగా చేసిన ప్రయత్నం.. ఇప్పుడు బాగా రాజుకుని పెద్దమంటగా మండుతోంది. నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో ఆ మంట కార్చిచ్చులాగా బయటపడుతోంది. పార్టీకి నష్టం చేస్తుందా? లేదా? తర్వాతి సంగతి కానీ పార్టీ పరువు సమూలంగా తీసేస్తోంది.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు మరీ రెచ్చిపోతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని, పోలీసులను అధికారులను ఇష్టారీతిగా దూషిస్తూ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, పేకాటక్లబ్ లు ఇసుక దందాలు ఇలాంటి ఆరోపణలు ఆమె మీద మిక్కిలిగా ఉన్నాయి. జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఆమె గురించి గుసగుసలు వినిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ భర్త కత్తెర సురేష్ కుమార్ ను ఆ నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్ ఇటీవల నియమించారు. తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యే ఉండగా.. మరొక సమన్వయకర్తను నియమించడం అనూహ్యమే.. కానీ ఆ నియోజకవర్గానికి అలవాటే. అంతకుముందు డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆ పనిలో ఉంటూ ఎమ్మెల్యే శ్రీదేవికి పొగబెడుతూ వచ్చారు. ఆయన స్థానంలో కత్తెర సురేష్ కుమార్ వచ్చారు. ఈసారి అక్కడ ఎమ్మెల్యేగా పోటీచేసేది తానే అని ఆయన చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ముఠాలను పోషిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు.
సొంత ఎమ్మెల్యేగా ఉండగా, మరొక ఇన్చార్జి నియామకం ద్వారా జగన్ ఇదే జరగాలని కోరుకున్నారేమో తెలియదు. ఇప్పుడు అక్కడ నిప్పు బాగా రాజుకుంటోంది. రెండురోజుల కిందట ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ వంటి వాళ్లు అతిథులు. వారి ఎదుటే.. తాడికొండ ముటాలు కొట్లాడుకున్నాయి. ఎమ్మెల్యే శ్రీదేవి నాయకత్వం తమకు వద్దని, కత్తెర సురేష్ కుమార్ సారథ్యంలోనే పనిచేస్తామని కార్యకర్తలందరూ గోల చేయడం తమాషా. ఎమ్మెల్యేను ఇంత దారుణంగా లూప్ లైన్ లోకి నెట్టిన వ్యవహారం మరెక్కడా జరగలేదని పార్టీలోనే అనుకుంటున్నారు. సొంత పార్టీలో ముఠాలు, కుమ్ములాటలు ఉండేలా ప్రోత్సహించే బదులు.. జగన్ నాయకుడు గనుక.. ఆమెను మందలించడం, దారిలో పెట్టడం వంటి పనిచేసి ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ స్వయంగా ముట్టించిన నిప్పు.. రాజుకుంది!
Tuesday, November 26, 2024