కలలు కనడం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిపే సరికొత్త ఆలోచనలు చేయడం కేవలం చంద్రబాబునాయుడుకుమాత్రమే చేతనవుతుందా ఏమిటి? తాను కూడా అందుకు సమర్థుడినేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లుగా ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ‘నిరుపేదలకు ఇళ్లపట్టాలు’ ముసుగులో జగన్ చేస్తున్న ప్రయత్నం మొత్తం ఇలాంటి ఆలోచనకు నిదర్శనంగా కనిపిస్తోంది.
చంద్రబాబునాయుడు అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ నగరంగా తయారుచేస్తానని అప్పట్లో తన స్వప్నంగా చెప్పుకున్నారు. ప్రపంచం మొత్తం అమరావతి నగరం వైపు తలతిప్పి చూసేలా నిర్మిస్తామని కూడా ప్రకటించారు. దేశంలో నెంబర్ వన్ నగరంగా అమరావతిని తయారు చేయాలని చంద్రబాబు కలగంటే.. అమరావతి ప్రాంతంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్లమ్ ఏరియాలను తయారుచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వప్నిస్తున్నారు. ముంబాయిలోని ధారావి స్లమ్ ఏరియా అంటే.. ప్రపంచంలోని అతిపెద్ద స్లమ్ ఏరియాలలో ఒకటి. దానికి రెట్టింపును మించి ఉండేలా అమరావతి స్లమ్ లను తయారు చేయడానికి జగన్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్టుగా ఉంది.
స్లమ్ ఏరియా అంటేనే ధారావి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరు మోసింది. ముంబాయి నగరం ఒక అంచున ఉండే ధారావి దేశంలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా! ఇంతటి కీర్తిప్రతిష్టలు ఉన్న ధారావినే కేవలం 590 ఎకరాలలో మాత్రమే విస్తరించి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దాదాపు 1500 ఎకరాలలో ఇలాంటి స్లమ్ ను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు అంటూ ఒక్కో కుటుంబానికి ఒక్కొక్క సెంటు భూమి కేటాయించేందుకు ఇప్పటికే ప్రభుత్వం 1134 ఎకరాలను కేటాయించింది. దానికి సంబంధించి అమరావతి రైతులు ఇది మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం అంటూ పోరాడుతున్నాు. కేసు సుప్రీం దాకా వెళ్లింది. వారి నిరసనలను పట్టించుకోకుండా.. తెగబడుతున్న సర్కారు రోజుల వ్యవధిలోనే భూమి పట్టాలు పంపిణీచేసేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇది చాలదన్నట్టుగా.. అక్కడి పేదలకోసం ఇంటిపట్టాలు ఇవ్వడానికి మరో 268 ఎకరాలను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇవన్నీ పూర్తయితే.. ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అతిపెద్ద స్లమ్ ఏరియాలు అమరావతి లో ఉంటాయన్నమాట. కాకపోతే అమరావతి లో ఒకేచోట కాకుండా మూడుచోట్ల అవి విస్తరించి ఉండవచ్చు. ఆ రకంగా.. ముంబాయిలోని ధారావిని మించిన స్లమ్ ఏరియాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నగరంలో కానుకగా ఇవ్వడానికి ముఖ్యమంత్రి జగన్ కలగంటున్నట్టుగా ఉంది.
జగన్ స్వప్నం.. అమరావతిలో మరో ధారావి సృష్టి!
Thursday, December 19, 2024