వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత ఆస్తి. ఆయన సొంత రెక్కల కష్టం. తన తండ్రి పేరు కలిసి వచ్చేలాగా ఆయన పెట్టిన పార్టీ.. ఆయన ఇష్టప్రకారం నడుస్తుంది. రెండుదఫాలుగా ముఖ్యమంత్రి అయి, ప్రజాక్షేత్రంలో కార్యక్రమానికి వెళ్తూ అర్థంతరంగా మరణించిన వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రజల్లో ఉండే అనల్పమైన అభిమానం జగన్మోహన్ రెడ్డి కి అయాచితంగా కలిసివచ్చిన పెట్టుబడి. అది ఆయన సొంత పార్టీ గనుక.. తనకు ఇష్టం వచ్చిన రీతిలో నడుపుతారు. పార్టీని నడపడంలో మోనార్క్ లాగా వ్యవహరిస్తారని జగన్ గురించి పలువురు చెబుతూ ఉంటారు. అలాగే పార్టీ నాయకుల్లో తనకంటె వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, సీనియర్లు ఎవరైనా సరే.. తన మాటకు ఎదురుచెప్పడాన్ని ఆయన సహించరని కూడా కొందరు అంటూ ఉంటారు. అలాంటి కారణాలతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన అనేకమంది సీనియర్లను జగన్ ఇప్పటికే పార్టీనుంచి వెళ్లగొట్టినట్టుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అదే క్రమంలో ఇప్పటిదాకా పార్టీలో మిగిలిన మరొక వైఎస్ ఆప్తుడు, ఆనం రామనారాయణరెడ్డిని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ వదిలించుకోవాలని చూస్తున్నట్టుగా ఉంది.
తన నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. తాను ఇంతకూ పార్టీలో ఉన్నానో లేదో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉండగానే.. మరికొందరు నాయకులు వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తామేనంటూ స్థానికంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. అంటే ఆనం రామనారాయణరెడ్డికి పార్టీ ఆల్రెడీ పొగబెట్టినట్టుగా భావించాల్సి వస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతో ఆత్మీయులైన మైసూరారెడ్డి, కొణతల రామకృష్ణ లాంటి నాయకులు తొలినుంచి ఉన్నారు. వైఎస్ఆర్ ను ఒరేయ్ అని పిలిచేచనువున్న మైసూరారెడ్డి తొలిరోజుల్లో కీలకంగా ఉండి తర్వాత పార్టీ వీడి వెళ్లిపోయారు. తండ్రి వయసున్న ఆయన సైతం తనను ‘సర్’ అని పిలవాలని జగన్ కోరుకునే వారని, అందుకే ఆయనను పక్కన పెట్టారని, ఇలాంటి పెత్తనం సహించలేక మైసూరా వెళ్లిపోయారని ప్రచారం జరిగింది.కొణతల రామకృష్ణ కూడా పార్టీలో ఇమడలేదు. వైఎస్ సన్నిహితుల్లో ఉండవిల్లి అరుణ్ కుమార్ జగన్ పోడకలు గమనించి.. అసలు ఆ పార్టీలో చేరనేలేదు. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక్కరూ.. పార్టీలో మెయిన్ స్ట్రీమ్ కాకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కు ఎంతో ఆప్తులు. ఆయన మంత్రివర్గంలో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆనంకు కూడా పొగపెట్టడం ద్వారా.. తండ్రికి ఆప్తులైన సీనియర్లు ఎవరూ పార్టీలో మిగలొద్దు అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ‘తనకంటె పెద్ద’ లాగా కనిపించే ఏ ఒక్కరినీ పార్టీలో జగన్ ఉండనివ్వరని అంటున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఇప్పుడు మళ్లీ తెలుగుదేశంలో చేరడం మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
జగన్ స్ట్రాటజీ : తండ్రికి ఆప్తులు ఎవరూ మిగలొద్దు!
Wednesday, January 22, 2025