కందుకూరు దుర్ఘటన చాలా బాధాకరమైనది. అయితే దీనిని ఆధారం చేసుకుని శవరాజకీయాలు చేయడానికి రాజకీయ పార్టీలు సహజంగానే ప్రయత్నిస్తున్నాయి. మనుషులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వెళ్లినా దానిని కూడా రాజకీయం చేస్తున్నారు. కందుకూరులో భద్రత ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్నికప్పిపుచ్చుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. చంద్రబాబునాయుడు వల్లనే 8 మంది చనిపోయారని ప్రభుత్వంలోని పెద్దలందరూ పదేపదే అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే ప్రయత్నంలో మంత్రి రోజా కూడా తమ అధినేతను ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు మీద నిందలు వేశారు గానీ.. పప్పులో కాలేశారు. పరోక్షంగా ఆమె ఈ దుర్ఘటన విషయంలో జగన్ సర్కారు వైఫల్యాన్నే ఎత్తిచూపించినట్లుగా అయింది.
ఎలాగంటే-
మంత్రి రోజా.. తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం బయటకు వచ్చి.. దేవుడి దయతో రెట్టించిన ఎనర్జీ, ఉత్సాహంతో ప్రజాసేవ చేస్తానని ఒక మాట చెప్పారు. ఆ బోలెడంత సమయాన్ని తర్వాత చంద్రబాబునాయుడు ను తిట్టడానికి, లోకేష్ ను ఎద్దేవా చేయడానికి వాడుకున్నారు. చంద్రబాబునాయుడు మీద తాము హత్య కేసు పెడితే.. వేధిస్తున్నారంటూ విమర్శిస్తారని.. ఈ దుర్ఘటన ఆధారంగా కోర్టులే చొరవతీసుకుని సూమోటోగా హత్యకేసు పెట్టి ఆయనను అరెస్టు చేయించాలని కూడా ఆమె కోరారు.
అయితే.. ఆమె ఓ మాట చెప్పారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 3600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారని, వందల సభలు నిర్వహించారని ఎక్కడా కూడా చిన్న దుర్ఘటన, ఉపద్రవం జరగలేదని రోజా అన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య వందల కార్యక్రమాలు చేశాం అన్నారు.
రోజా అచ్చమైన నిజం వెల్లడించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉన్నారు. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తోంటే.. భయపడకుండా పటిష్టమైన పోలీసుభద్రత కల్పించారు గనుకనే.. ఆయన పాదయాత్ర దుర్ఘటనలు లేకుండా పూర్తయింది. అప్పుడు అంతా పకడ్బందీగా చేశారని రోజా స్వయంగా ధ్రువీకరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాట్లలో లోపమే కందుకూరు మరణాలకు కారణం అని కూడా రోజా మాటలే స్పష్టం చేస్తున్నాయి.
జగన్ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తిచూపిన మంత్రి రోజా!
Thursday, December 19, 2024