ప్రజాప్రతినిధి అంటే ప్రజలకోసం పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలి, కష్టపడాలి, ఉద్యమించాలి. ఆ పనిచేయడాన్ని కూడా అడ్డుకుంటే ఏం అనుకోవాలి? అడ్డుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఆ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏవగింపు పెంచుకోరా? ఇలాంటి ప్రశ్నలకు ఎవరైనా సరే అవుననే సమాధానమే చెబుతారు. కానీ ఇలాంటి కనీస అవగాహన లేనట్లుగా.. జగన్ సర్కారు పరువు తీసేలా, ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా నెల్లూరులో తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు మంగళవారం నాడు హౌస్ అరెస్ట్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన తన అనుచరులతో కలిసి నిరసన కు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధం చేయడం విశేషం. నిరసనకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. అయినా సరే.. నిరసన చేసి తీరుతానని కోటంరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
పోలీసులు చేస్తున్న ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చేటు చేయవా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. కోటంరెడ్డి విషయంలో ప్రభుత్వం, పోలీసులు ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు. కోటంరెడ్డి గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా అధికారపార్టీతో సఖ్యంగా చెలామణీలో ఉన్న రోజుల్లోనే సొంత సర్కారు మీద విమర్శలు గుప్పించారు. షాదీమహల్ నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాతి పరిణామాల్లో ఆయన మీద పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీ చేయడానికి కోటంరెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తన నియోజకవర్గ పరిధిలోనే పొట్టేపాలెం అనే గ్రామం వద్ద కలుజు మరమ్ముతులు చేపట్టాలంటూ.. గతంలో శ్రీధర్ రెడ్డి నిరసనలకు దిగితే.. అప్పుడు కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అధికార పార్టీలో ఉన్నప్పుడే.. షాదీమహల్ వ్యవహారం వివాదం అయింది. ఇప్పుడు ఆయనను అధికార పార్టీనుంచి గెంటేసిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ హాలు కోసం ఆయన డిమాండ్ ను సర్కారు పట్టించుకోవడం లేదు.
రాజకీయ కారణాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చాలా జరుగుతుంటాయి. పోలీసులు వాటిని ఉక్కుపాదంతో అణచివేయడం చాలా సహజం. అలాంటివాటిని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసే నిరసనల్ని కూడా ఇలా అణిచివేస్తే ప్రజలు ఆగ్రహిస్తారు. ప్రభుత్వం పరువు పోవడం మాత్రమే కాదు.. ప్రజలకు ఆగ్రహం కలిగిందంటే.. వారి చేతిలో ఉన్న అధికారం కూడా జారిపోతుంది.
ఇలా అణిచేస్తే.. జగన్ సర్కారు పరువు గోవిందా!
Thursday, December 19, 2024