ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లకు పైబడి నారా లోకేష్ తన సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలు పూర్తిచేసుకుని లోకేష్ యాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రవేశించి కొనసాగుతోంది. ప్రభుత్వ దుర్మార్గాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న నారా లోకేష్, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో పార్టీ హామీలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. జగన్ ప్రభుత్వం ఎక్కడైతే తమ అసమర్థతను బయటపెట్టుకున్నదో, ఎక్కడ వారి నిర్వహణ అవకతవకలుగా సాగిపోయినదో.. అదే అంశాలు లోకేష్ కు సరికొత్త అస్త్రాలుగా మారుతున్నట్టుంది. వాటిని చక్కదిద్ది.. ప్రజలకు ఇబ్బంది లేని మేలును కలగచేస్తాం అని చెప్పడమే లోకేష్ తాజా హామీలుగా సాగుతున్నాయి.
అసలే నిధుల కొరతతో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారు, ఏ నెలకు ఆనెల కొత్త అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లర డబ్బులైనా సరే.. పుట్టగల అన్ని రకాల ఆదాయమార్గాలను కూడా ప్రభుత్వం అన్వేషిస్తూనే ఉంది. ఈ క్రమంలో భాగంగానే ఓటీఎస్ అనే పద్ధతిని తీసుకువచ్చారు. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని ఇళ్లుకట్టుకున్న పేదల పట్టాలు సర్కారు వద్దనే ఉండిపోయాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ అని పేరు పెట్టి.. పదివేల రూపాయల వంతున చెల్లించినట్లయితే వారికి పూర్తి యాజమాన్య హక్కులతో పట్టాలు ఇచ్చేస్తాం అని, అప్పుడు పేదలకు ఆ ఇళ్ల స్థలాల మీద విక్రయాది హక్కులు సహా సమస్త అధికారాలువస్తాయని ప్రభుత్వం ఊరించింది.
ఆశపడిన పేదలు చాలా మంది ఓటీఎస్ స్కీములో పట్టాలు తీసుకోవడానికి సొమ్ములు చెల్లించారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిపోతాయని ఆశించింది. అయితే వారు అనుకున్నంతగా ప్రజల నుంచి స్పందన రాలేదు. ఓటీఎస్ విషయంలో వాలంటీర్లకు, రెవెన్యూ అధికార్లకు టార్గెట్లు విధించి మరీ వెంటపడ్డారు. అయినా సరే నామాత్రపు స్పందనే వచ్చింది. అయితే ఈలోగా.. ఓటీఎస్ స్కీములో ఉన్న డొల్లతనం కూడా బయటపడింది. డబ్బు కట్టిన వారికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కనీసం బ్యాంకు లోన్లకు కూడా ఉపయోగపడడం లేదని తేలింది. దీంతో ప్రస్తుతానికి ఓటీఎస్ ను ప్రభుత్వం ఆపింది.
సరిగ్గా ఈ అవకతవకల నిర్వహణను లోకేష్ పట్టుకున్నారు. ఓటీఎస్ కింద పేదలు డబ్బులు అసలు చెల్లించవద్దు. తెలుగుదేశం సర్కారు వచ్చిందంటే.. మీ ఇళ్ల మీద పూర్తి యాజమాన్య హక్కులతో, లోన్లు కూడా వచ్చేలాగా పూర్తిస్థాయి పట్టాలు ఇస్తాం అని ఆయన వరం ప్రకటించారు. నిజంగా ఇది చాలా మంది పేదలను ఆకర్షించే అంశమే. మరి లోకేష్ హామీ పట్ల ప్రజల స్పందన ఎలా ఉంటుందో.. వారి పార్టీకి ఈ వరం ఎంత ఎడ్వాంటేజీగా మారుతుందో వేచిచూడాలి.