ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ విషయంలో ప్రతిసారీ ఒకేతీరుగా చికాకు పెడుతుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు, ఆయన పార్టీ నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ ను నిందించాల్సి వస్తే.. వారి వద్ద పెద్దగా అస్త్రాలేమీ ఉండవు. కామన్ గా వారికి దొరికేది ఒకటే అంశం.. పవన్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు? పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అనే మాట ప్రస్తావించకుండా.. వైసీపీ నాయకులకు పవన్ కల్యాణ్ ను తిట్టడం సాధ్యం కాదు.
అలాగని వైసీపీ పార్టీ అనేది రామచంద్రుడి నైతిక విలువలను తమ పార్టీ సిద్ధాంతాలుగా మార్చుకుని ఏకపత్నీ వ్రతాన్ని ఒక అర్హతగా అభ్యర్థుల విషయంలో వ్యవహరిస్తున్నదా అంటే అదేం లేదు. ఏక కాలంలో ఇద్దరు, ముగ్గురు భార్యలను అధికారికంగానూ, అనధికారికంగానూ మెయింటైన్ చేస్తున్న అనేక మంది ఆ పార్టీలో అనేకానేక కీలక పదవుల్లో ఉన్నారనే గుసగుసలు ప్రజల్లో వినిపిస్తుంటాయి. అయితే.. పవన్ చట్టబద్ధంగా, ఒక వివాహాన్ని రద్దు చేసుకున్న తరువాత చేసుకున్న మరో వివాహం కూడా వీరికి తప్పు లాగా కనిపిస్తుంది. అయితే.. ఇలాంటి విమర్శలతో పవన్ దళం విసిగిపోయింది. ఇప్పుడు వారంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో లోపాలేం ఉన్నాయో వెతికే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
విద్యార్థి దశ నుంచి హైదరాబాదులోనే పెరిగిన జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఉండే లోపాలను గురించి తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఆ అంశాలతో ఆయన మీద కూడా వ్యక్తిగతమైన విమర్శలతో దాడి చేయాలనేది ఆలోచనగా తెలుస్తోంది. పవన్ తాను వ్యక్తిగత విషయాలు మాట్లాడను అంటూ.. ఒక నైతికత పద్ధతిని ప్రకటించారు గనుక.. తన పార్టీలో అరెస్టులకు భయపడని గట్టి నాయకులతో మాట్లాడించాలని అనుకుంటున్నట్టుగా సమాచారం.
మొత్తానికి కొన్ని అదనపు వివరాలు జగన్ ను విమర్శించడానికి రాబట్టినట్టు కనిపిస్తోంది. తాత రాజారెడ్డి హయాంలో జగన్.. స్థానికంగా ఎస్ఐ ప్రకాశ్ బాబును స్టేషన్లోనే కొట్టారని పవన్ ఆరోపించారు. ఇతర వివరాల జోలికి వెళ్లకుండా నీ వ్యక్తిగత విషయాల చిట్టా విప్పానంటే చెవుల్లో నుంచి రక్తం వస్తుంది అని మాత్రమే పవన్ హెచ్చరించారు. వాళ్లు సేకరిస్తున్న విషయాల్లో ఇది ఒకటని.. మిగిలిన ఇంకా లోతైన వ్యక్తిగత విషయాలను తొందరలోనే బయటకు వదులుతారని అనుకుంటున్నారు.