ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే సామాన్య ప్రజలకు అసలే హడల్ గా తయారవుతోంది. ఏదైనా పట్టణంలో ముఖ్యమంత్రి పాల్గొనే ఒక కార్యక్రమం షెడ్యూలు అయితే.. ఆ పట్టణ వాసులకు రెండు మూడు రోజుల పాటూ జీవితం నరకప్రాయమైపోతుంది. రోడ్ల మీద దుకాణాలు మూయించేస్తారు. రోడ్లంతా కూడా బారికేడ్లు కట్టేస్తారు. ప్రజలను కూడా వీధుల్లో సంచరించనివ్వరు. దుకాణాలను, చివరికి రైతు బజారు లాంటివి కూడా తెరవనివ్వరు. ఇలా కర్ఫ్యూలాంటి వాతావరణాన్ని సృష్టించితే.. ఆ తర్వాత.. మరుభూమిని ఏలుకోవడానికి ఏతెంచిన చక్రవర్తి లాగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. తాను సభ పెట్టదలచుకున్న చోటికి.. నిర్జనంగా ఉన్న రోడ్లమీదనుంచి వెళతారు. అక్కడ మాత్రం.. పుష్కలంగా జనం ఉంటారు. మహిళా సంఘాలు, తదితర లబ్ధిదారులైన జనమంతా బలవంతంగా అక్కడకు తోలుకురాబడి నిరీక్షిస్తుంటారు. వారిని ఉద్దేశించి ఆయన నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోతారు. ఈ మాత్రం దానికి ఊరంతా బారికేడ్లు, ప్రజల మీద నిషేధాజ్ఞలు, షాపులు కూడా మూసివేయించడాలు వంటి ఘటనలతో ఊరు ఛిన్నాభిన్నం అవుతుంది.
అలా జనం మధ్యలోకి రావాలంటేనే నిత్యం భయంతో వణికిపోతూ ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పల్లెనిద్ర పేరుతో పల్లెలకు వస్తారట. వారానికి రెండు రోజుల పాటూ రెండు పల్లెలను విజిట్ చేసి.. పగలు ఆ పల్లె కష్టాలను తెలుసుకుని, ప్రజలతో ముఖాముఖి నిర్వహించి.. రాత్రి ఆ పల్లెలోనే బసచేసి తిరిగి వెళతారట. ఆ మేరకు ఏప్రిల్ నుంచి అమలు చేసేలా పల్లెనిద్ర కార్యక్రమాన్ని ప్రకటించారు.
నగరాలు/పట్టణాలకు రావాలంటేనే భయంతో.. అక్కడి ప్రజల జీవితాన్ని నిర్బంధంలోకి నెట్టేసే ముఖ్యమంత్రి ఇక పల్లెల్లోకి వస్తే అక్కడి పరిస్థితిని ఎలా మార్చేస్తారో అనే భయం పలువురిలో వ్యక్తం అవుతోంది. జగన్ తో ముఖాముఖి అంటే.. అందులో పాల్గొనే పల్లె జనాన్ని కొన్ని రోజులు, వారాల ముందే ఎంపిక చేసి.. వారికి పూర్తి స్థాయి కోచింగ్ ఇస్తారని అనుకోవచ్చు. ముఖాముఖిలో ముఖ్యమంత్రిని, నవరత్నాలను ఎలా పొగడాలి. వాటి వల్ల తమ జీవితాలు ఎలా బాగుపడిపోయిందీ.. ఏ రకంగా వివరించాలి.. అనే అనేక విషయాల్లో ఈ తర్ఫీదు ఉంటుందని అనుకోవచ్చు. అలాగే.. ప్రభుత్వానికి సమస్యలు చెప్పే వాళ్లు పథకాలు అందలేదని అనుకునే ప్రజలను ముఖ్యమంత్రి ముఖాముఖి చాయలకు కూడా రానివ్వకుండా చూస్తారని కూడా అనుకోవచ్చు. అలాగే.. జగన్ పర్యటించడానికి వీలైనంత వరకు వైసీపీ మద్దతు దారులు మాత్రమే ఉండే పల్లెలనే ఎంపిక చేస్తారు. కుదరని పక్షంలో ఆ గ్రామంలోని తెలుగుదేశం సానుభూతిపరులు, కార్యకర్తల్ని గృహనిర్బంధం చేయడమూ, అరెస్టులుచేయడమూ జరిగినా ఆశ్చర్యం లేదు. ఈ రకంగా వారినికి రెండు పల్లెల జీవితాలను నరకప్రాయంగా మార్చివేసేందుకే ముఖ్యమంత్రి పల్లెనిద్ర కార్యక్రమానికి పూనుకుంటున్నారేమో అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రజల జీవితాలతో ఆడుకోకుండా.. జగన్ తన కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటు మంచిదని అంటున్నాయి.