జగన్ రాయబారం ఢమాల్! తొడకొట్టిన పిల్లి!!

Sunday, December 22, 2024

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ రాజకీయం ముదిరి పాకాన పడింది. ఈ నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చడానికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు పురిట్లోనే సంధికొట్టింది. రాజ్యసభ ఎంపీ, వైఎస్ఆర్ కు సన్నిహితుడు అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పిలిచి జగన్ చేసిన రాయభారం ఢమాల్ అన్నది. ఆయన క్లాస్ పీకారు గానీ.. ఆ క్లాస్ తో పిల్లి సుభాష్ చంద్రబోస్ మరింతగా రెచ్చిపోతున్నట్టుంది. మంత్రి వేణుగోపాలకృష్ణకు టికెట్ ఇస్తే గనుక.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించడం తాజా సంచలనం.

రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణకు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం పొగపెడుతోంది. వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని, పిల్లి సుభాష్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సందేనని ఆయన వర్గం పార్టీ నాయకులు ఇటీవల ఒక ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు. ఆ తర్వాత.. పిల్లి వర్గానికి చెందిన ఒక నాయకుడి మీద మంత్రి సమక్షంలోనే ఆయన మనుషులు చేయి చేసుకుని కొట్టడం కూడా జరిగింది. ఈ పరిణామాలు పార్టీ పరువును రచ్చకీడ్చాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పిల్లి సుభాష్ ను తాడేపల్లి నివాసానికి పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడారు. కొడుక్కి టికెట్ కావాలని తనకు చెబితే తను ఏదో ఒకటి ఏర్పాటుచేస్తాను కదా.. ఇలా రచ్చకెక్కడం ఎందుకు అంటూ మందలించినట్టు వార్తలు వచ్చాయి. వేణుకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. అప్పటికి అంతా సద్దుమణిగినట్టే కనిపించింది.

కొన్ని రోజుల తర్వాత పిల్లి సుభాష్ నోరు విప్పారు. కొడుకు పోటీచేస్తాడని అనుకుంటున్న నియోజకవర్గం నుంచి తానే బరిలోకి దిగుతానని ఆయన హెచ్చరించారు. మంత్రి వేణుకు మళ్లీ టికెట్ ఇస్తే గనుక.. తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని ఆయన చెప్పడం గమనార్హం. కొన్ని రోజుల కిందట సూర్యప్రకాష్ కూడా.. పార్టీ తరఫున గానీ, ఇండిపెండెంటుగా గానీ తాను పోటీచేయడం గ్యారంటీ అని ప్రకటించారు. అయితే జగన్ క్లాస్ పీకిన తర్వాత పిల్లి వారి వ్యూహం మారినట్టుంది. కొడుకు బదులుగా తానే బరిలోకిదిగి వేణును ఓడించడానికి పిల్లి వర్గం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.   

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles